ఇచ్చిన మాట ప్రకారం జాబ్ ​క్యాలెండర్ ​రిలీజ్​

ఇచ్చిన మాట ప్రకారం జాబ్ ​క్యాలెండర్ ​రిలీజ్​
  •     పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఇప్పటికే ప్రక్షాళన చేశాం: భట్టి
  •     గత ప్రభుత్వంలో ప్రశ్నాపత్రాల లీక్, పరీక్షలు వాయిదాలేనని కామెంట్​ 

హైదరాబాద్, వెలుగు : నిరుద్యోగ యువతీ యువకుల ఆశలు నెరవేర్చేందుకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ముందే చెప్పామని, ఇచ్చిన మాట ప్రకారం  సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో విడుదల చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తెలిపారు.  తాము అధికారంలోకి రాగానే 32,410 మంది నిరుద్యోగ  యువతకు నియామక ఉత్తర్వులు అందజేశామని, మరో13,505 ఉద్యోగాల నియామకం చివరి దశకు చేరుకున్నదని తెలిపారు. 

అసెంబ్లీలో శుక్రవారం భట్టి విక్రమార్క జాబ్​ క్యాలెండర్ పై ​ స్టేట్ మెంట్​ ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాల ప్రకటనలు రద్దు కావడం, వాయిదా వేయడం, ప్రశ్నాపత్రాల లీక్, పరీక్షల తేదీలు ఓవర్ లాప్ తో నిరుద్యోగులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు.  గ్రూప్–1  పరీక్ష రెండుసార్లు రద్దయిందని గుర్తుచేశారు. 2023 మార్చి 17న పేపర్ లీక్, 2024 ఫిబ్రవరి 19న అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకపోవడంతో  పరీక్ష రద్దు చేశారని చెప్పారు.  

రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డితో కలిసి యూపీఎస్సీ చైర్మన్ ను సంప్రదించారని తెలిపారు.  సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి, యూపీఎస్సీ, కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పై అధ్యయనం చేయించారని చెప్పారు. గ్రూప్–1  నోటిఫికేషన్ లో అదనంగా 60 పోస్టులు జోడించి, 563 ఖాళీల కోసం కొత్తగా నోటిఫికేషన్ జారీ చేశామని వివరించారు.  

విజయవంతంగా ప్రిలిమ్స్​ నిర్వహించి, ఫలితాలు కూడా ప్రకటించామని, ఈ ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్​కు షెడ్యూల్ విడుదల చేసినట్టు వివరించారు.  11,022 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసినట్టు చెప్పారు.  గ్రూప్–1, గ్రూప్ –2, గ్రూప్– 3 పరీక్షల మధ్య తగిన సమయం లేకపోవడంతో నిరుద్యోగుల కోరిక మేరకు ఆగస్టు 7, 8 వ తేదీల్లో జరగాల్సిన గ్రూప్ –2 పరీక్షలను డిసెంబర్ కు వాయిదా వేసినట్టు చెప్పారు . కేబినెట్​ సమావేశంలో జాబ్ క్యాలెండర్ గురించి  చర్చించి, ఆమోదించామని భట్టి విక్రమార్క తెలిపారు.