- ప్రపంచంలో యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఉద్యోగ మార్పులకు వెనకడుగు
- లే ఆఫ్స్ భయంతో ఉద్యోగ భద్రత వైపు మొగ్గు
- ఐటీ, కార్పొరేట్, మీడియా రంగాల్లో ఎక్కువగా కనిపిస్తున్న ధోరణి
- కెరీర్ ఎదుగుదలపై ప్రభావం
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితి వల్ల ఉద్యోగుల్లో ‘జాబ్ హగ్గింగ్’ అనే కొత్త ధోరణి పెరుగుతోంది. మెరుగైన జీతం కోసం కంపెనీలు మారడం కంటే, ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడమే మేలని ఐటీ, ఫైనాన్స్, మీడియా తదితర రంగాల వారు భావిస్తున్నారు. ఏఐ , ఆంథ్రోపిక్ వంటి సాంకేతిక మార్పులు, గ్లోబల్ మార్కెట్‌లో నియామకాలు తగ్గడం వల్ల ఉద్యోగ భద్రతపై ఆందోళన పెరిగింది. దీనివల్ల జాబ్ మార్కెట్‌లో గతంలో ఉన్న వేగవంతమైన వలసలు తగ్గిపోయాయి.
కార్పొరేట్ రంగంలో పరిస్థితి ఇది..
కార్పొరేట్, ఐటీ రంగాల్లో కొత్త అవకాశాలు వచ్చినా ఉద్యోగులు ప్రస్తుత జాబ్ కే ప్రాధాన్యతనిస్తూ ‘జాబ్ హగ్గింగ్’ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల ఉద్యోగ భద్రత లభించినప్పటికీ.. కెరీర్ , జీతాల పెరుగుదల మందగించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఏఐ వంటి సాంకేతిక విప్లవాలను తట్టుకుని నిలబడాలంటే కేవలం ఒకే ఉద్యోగానికి కట్టుబడి ఉండటమే కాకుండా.. నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఉద్యోగ భద్రతే ముఖ్యం..
వివిధ జాబ్ సెర్చ్ కంపెనీలు నిర్వహించిన సర్వే ప్రకారం.. 71 శాతం ఉద్యోగులు ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని వదలకుండా అందులోనే కొనసాగడానికి ఇష్టపడుతున్నారు. 2025లో 45 శాతం ఉద్యోగులు ‘జాబ్ హగ్గింగ్’ చేశారు. 2026లో ఇది 57 శాతానికి పెరిగింది. దూసుకొస్తున్న ఏఐ, అంథ్రోపిక్స్ భయంతో 70 శాతం ఉద్యోగులు తమ ఉద్యోగాలపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు.
స్కిల్ ఉంటేనే హైరింగ్..
హైదరాబాద్ ఐటీ రంగంలో ‘జాబ్ హగ్గింగ్’ ధోరణి వేగంగా పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో మందగమనం, ఏఐ, ఆటోమేషన్ ప్రభావంతో నియామకాలు 2 నుంచి 3 శాతం తగ్గడమే దీనికి ప్రధాన కారణం. 2025లో ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు 76,000 పైగా ఉద్యోగాల్లో కోత విధించగా..మన దేశంలో వందల స్టార్టప్‌లు మూతపడటం, ‘సైలెంట్ లే ఆఫ్స్’ ఉద్యోగుల్లో భయాన్ని పెంచాయి.
ఒకప్పుడు మెరుగైన జీతం కోసం కంపెనీలు మారే సాఫ్ట్‌వేర్ నిపుణులు, ఇప్పుడు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడక ఉన్న ఉద్యోగాన్నే గట్టిగా పట్టుకుని కొనసాగుతున్నారు. దేశంలో ఏటా సుమారు 9 లక్షల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తుండగా.. 3 లక్షల కొత్త ఉద్యోగాలు మాత్రమే ఉంటున్నాయి. కొత్తగా వస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడం, తక్కువ జీతాలకే పని చేయడానికి ముందుకు వస్తుండడంతో పాత ఉద్యోగుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారుతున్నది. దీనివల్ల చాలా మంది కెరీర్ గ్రోత్ లేకపోయినా ప్రస్తుత ఉద్యోగాన్ని మాత్రం వదలడం లేదు.
మీడియా రంగంలో..
ప్రస్తుతం మీడియా రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. చాలా కంపెనీలు ఏఐతో వార్తలు చదివించడం, స్క్రిప్ట్ రైటింగ్, ట్రాన్స్ లేషన్స్ చేయిస్తున్నాయి. ఒకప్పుడు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ట్రాన్స్ లేషన్ చేసే వారికి ఎక్కువగా డిమాండ్ ఉండేది. ప్రస్తుతం ఏఐ వల్ల ట్రాన్స్ లేషన్ చేసే వారిని ఆయా సంస్థలు ప్రత్యేకంగా నియమించుకోవడం లేదు. సంస్థలో ఉన్న వారికే ఏఐలో శిక్షణ ఇచ్చి తక్కువ శాలరీకే ఆ పని చేయించుకుంటున్నారు.
కొత్తగా డిజిటల్ మీడియా, వెబ్ సైట్లు ఎన్నో వస్తున్నా ఇతర సంస్థల్లో ఉన్నవారు ఇలాంటి వాటిలో చేరడానికి ఆసక్తి చూపించడం లేదు. ఎక్కువ జీతం ఆఫర్చేస్తున్నా చేరడానికి ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఇందులో చాలామటుకు ఆరు నెలల కంటే ఎక్కువ కాలం నడవకుండానే క్లోజ్ అవుతున్నాయి. దీంతో ఉన్న చోట తక్కువ జీతం అయినా సరేనని సర్ధుకుపోతున్నారు.
న్యూ హైరింగ్స్ తక్కువే..
గతంలో టీసీఎస్ లో మూడేండ్లకు పైగా పనిచేశా. ఇప్పుడు ఇన్ఫోసిస్ లో ఉన్నా.ఏఐ, అంథ్రోపిక్స్ శరవేగంగా దూసుకువస్తుండడంతో అందరూ వాటిని నేర్చుకోవడానికి ఉత్సాహం చూపుతున్నరు. కొత్త ఉద్యోగంలోకి మారాలంటే వీటిపై పట్టు అవసరం. ప్రస్తుతం న్యూ హైరింగ్స్తక్కువే. మార్కెట్ లోనూ ఉద్యోగాలకు భరోసా లేదు. అందుకే అవకాశాలున్నా జాబ్మారడం లేదు.
రాజశ్రీ, ఇన్ఫోసిస్ ఉద్యోగిని

