- భారీ జీతం, సౌకర్యాలంటూ దగా
పద్మారావునగర్, వెలుగు: నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు మోసాలకు తెరలేపారు. సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలు వైరల్ చేస్తున్నారు. వార్డ్బాయ్, స్వీపర్, సెక్యూరిటీ గార్డు వంటి పోస్టులకు రాతపరీక్ష లేకుండానే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ చేస్తున్నామని, నెలకు రూ. 31,500 నుంచి రూ. 46 వేల వరకు జీతం ఇస్తామంటూ నమ్మబలుకుతున్నారు. ఈ తప్పుడు ప్రకటనల్లో ‘గాంధీ హస్పిటల్ రిక్రూట్‌మెంట్ సెల్’ పేరుతో నకిలీ స్టాంపులను కూడా వాడుతుండటంతో నిరుద్యోగులు సులభంగా నమ్మి మోసపోతున్నారు.
పర్మినెంట్ ఉద్యోగం, పెన్షన్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి ఆకర్షణీయమైన బెనిఫిట్స్ ఉంటాయని పేర్కొంటూ ఆన్లైన్ లింకుల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మరికొన్ని చోట్ల స్పీచ్ థెరపీ, మార్చురీ అటెండర్ వంటి 39 పోస్టులు ఉన్నాయని, అప్లికేషన్ ఫీజు కింద రూ. 300 చెల్లించాలని కోరుతూ అందినకాడికి దండుకుంటున్నారు. ఈ ప్రకటనల్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని, డీఎంఈ కార్యాలయం కోఠి తెలంగాణ అని రెండు రాష్ట్రాల పేర్లను కలిపి వాడుతుండటం గమనార్హం.
సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశాం: సూపరింటెండెంట్
ఈ వ్యవహారంపై గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ వాణి స్పందిస్తూ.. ప్రస్తుతం హాస్పిటల్లో రెగ్యులర్, కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఎలాంటి నియామకాలు చేపట్టడం లేదని స్పష్టం చేశారు. సోమవారం కొంతమంది నిరుద్యోగులు హాస్పిటల్‌కు వచ్చి ఆరా తీయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చిందన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు క్లిప్పింగ్‌లను నమ్మవద్దని, ఈ నకిలీ ప్రకటనలపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు, సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తికి ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించారు. నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండి మోసగాళ్ల బారిన పడవద్దని కోరారు.
