
నిర్మల్, వెలుగు: వీఆర్ఏ వారసులకు జీవో 81, 85 ప్రకారం వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు నిర్మల్ ఆర్డీవో ఆఫీస్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వీఆర్‌ఏ వారసులు, జేఏసీ నేతలు మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వం నియమించబోయే జీపీవో (గ్రామ పరిపాలన అధికారి) నియామకాల్లో వీఆర్ఏ వారసులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
గత ప్రభుత్వం 20,555 మంది వీఆర్ఏల్లో 16,758 మందిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిందని, మిగతా 3,797 మంది వారసులకు జాబ్ ఆర్డర్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. జాబ్‌లు వస్తాయని రెండేండ్లుగా ఆశతో ఎదురుచూస్తున్నామన్నారు. అనారోగ్యం పాలైన తల్లిదండ్రుల స్థానంలో పదేండ్లుగా వారసులు వీఆర్ఏలుగా పనిచేస్తున్నారన్నారు. ఇందులో దళిత, బలహీనవర్గాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని, వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.