
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పాలనాధికారి (జీపీవో)ని ప్రతి మండలంలో భూ విస్తీర్ణాన్ని బట్టి నలుగురు నుంచి ఆరుగురు లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకానికి ఈ నెల 27న శిక్షణ పొందిన అభ్యర్థులకు తుది పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. 28, 29 తేదీల్లో జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ల్యాబ్ ప్రాక్టికల్ పరీక్ష ఉంటుందని, ఆగస్టు 12న ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు.
తుది పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు 40 రోజులు అప్రెంటిస్ శిక్షణ ఉంటుందన్నారు. భూ భారతి చట్టంలో రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి చేసినందున సర్వేయర్ల కొరత తీర్చేందుకు లైసెన్స్‌డ్ సర్వేయర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా, 10 వేల మంది అప్లయ్ చేసుకున్నారని తెలిపారు. ఇందులో 7 వేల మందికి మే 26న శిక్షణ ప్రారంభించగా, ఈ నెల 26తో వీరికి 50 రోజుల శిక్షణ పూర్తవుతుందన్నారు. మిగిలిన 3 వేల మందికి ఆగస్టు రెండో వారం నుంచి శిక్షణ ప్రారంభిస్తామని చెప్పారు.
ఐదు నక్షా గ్రామాల్లో రీసర్వే పూర్తి
జీపీవోల నియామకాల కోసం రెవెన్యూ సంఘాల అభ్యర్థన మేరకు మరోసారి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నెల 27న వీరికి మరోసారి అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం నక్షా లేని గ్రామాలను గాలికి వదిలేసిందన్నారు. దీంతో రాష్ట్రంలో నక్షా లేని 413 గ్రామాలకు గాను ఐదు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా రీసర్వేను పూర్తి చేశామని చెప్పారు.
మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్ నగర్‌లో 422 ఎకరాలు, జగిత్యాల జిల్లా భీర్‌పూర్ మండలం కొమ్మనాపల్లి (కొత్తది) గ్రామంలో 626 ఎకరాలు, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడలోని 845 ఎకరాలు, ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురులో 502 ఎకరాలు, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం షాహిద్ నగర్‌లో 593 ఎకరాల్లో మొత్తం 2,988 ఎకరాల్లో ఈ సర్వే పూర్తయిందని తెలిపారు. ఈ సర్వే ఫలితాలను పరిగణనలోకి తీసుకొని మిగిలిన గ్రామాల్లో కూడా రీసర్వే నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.