మబ్బులొస్తున్నయ్.. తేలిపోతున్నయ్!... 15 జిల్లాల్లో సాధారణం కన్నా తక్కువ వానలు

మబ్బులొస్తున్నయ్.. తేలిపోతున్నయ్!... 15 జిల్లాల్లో సాధారణం కన్నా తక్కువ వానలు
  • కోస్తాంధ్రలో అల్పపీడనాలు ఏర్పడకపోవడమే కారణం
  • గాలుల వేగం ఎక్కువగా ఉండడంతో ఎగువకు తరలిపోతున్న తేమ
  • ఈ నెల మూడు లేదా నాలుగో వారంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
  • రాష్ట్రవ్యాప్తంగా 15 శాతం లోటు వర్షపాతం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వానలు అంతుచిక్కడం లేదు. మబ్బులు వచ్చి మురిపిస్తున్నా.. ఉన్నట్టుండి ఉసూరుమనిపిస్తున్నాయి. రాష్ట్రంలోకి ఈసారి రుతుపవనాలు మేలోనే ప్రవేశించి.. ఆరంభంలో మంచి వర్షాలే పడినా ఆ తర్వాతి నుంచి మాత్రం మొఖం చాటేశాయి. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు మే 26నే ప్రవేశించాయి. ఇప్పటివరకు ఒక్క పెద్ద వర్షమూ పడలేదు. అయితే, అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం వర్షాలు దంచికొడుతున్నాయి. అత్యంత భారీ వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. ఊర్లు కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. ఇక్కడ దక్షిణాదిలో ప్రత్యేకించి తెలంగాణలో మాత్రం వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనికి కారణం మన రీజియన్​లో ఒక్క అల్పపీడనమూ ఏర్పడకపోవడమేనని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 

గాలులు వేగంగా వీస్తున్నయ్​..

ఏదైనా ప్రాంతంలో వర్షాలు పడాలంటే రుతుపవనాలు స్థిరంగా ఉండాలి. మన ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడి.. సైక్లోనిక్​ సర్క్యులేషన్​ (ఉపరితల ఆవర్తనం) ఏర్పడితే.. ఆ గాలుల్లోని తేమ వర్షంగా కురుస్తుంటుంది. కానీ, రుతుపవనాలు ఎంటరైన దగ్గర్నుంచి మబ్బులు ఏర్పడుతున్నా.. గాలుల వేగం ఎక్కువగా ఉండడంతో తేమతో కూడిన రుతుపవనాలు ఎగువ రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. రుతుపవనాలు వచ్చినా కోస్తాంధ్ర (పశ్చిమ మధ్య బంగాళాఖాతం)లో అల్పపీడనం ఏర్పడాల్సి ఉంటుంది. ఆ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడి మన దగ్గర వర్షాలు కురుస్తాయి. 

రుతుపవనాలు ఎంటరైన దగ్గర్నుంచి ఈ పాటికి కోస్తాంధ్రలో రెండు మూడు అల్పపీడనాలు ఏర్పడాలి. కానీ, ఈ ఏడాది అల్పపీడనాల జాడ లేకుండా పోయింది. అయితే, బంగాళాఖాతంలో రెండు మూడు అల్పపీడనాలు ఏర్పడినా.. అవికాస్తా గాంగటిక్​ వెస్ట్​బెంగాల్, బంగ్లాదేశ్​ రీజియన్లలో ఏర్పడడంతో.. ఉత్తరాదిలో తేమ గాలులు స్థిరంగా ఉండి కుండపోత వర్షాలు పడుతున్నాయి. మన దగ్గర (కోస్తాంధ్ర)లో అల్పపీడనాలు ఏర్పడక తేమ గాలులు పైకి వెళ్లిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. 

మూడో వారంలో అల్పపీడనం

ఈ నెల మూడు లేదా నాలుగో వారంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో గాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్​ సిటీలోనూ రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది.  

15 జిల్లాల్లో లోటే

రాష్ట్రంలోని 15 జిల్లాల్లో లోటు వర్షపాతం రికార్డ్​ అయింది. మెదక్​, హనుమకొండ, జగిత్యాల, కరీంనగర్​, ములుగు, యాదాద్రి భువనగిరి, నల్గొండ, జయశంకర్​ భూపాలపల్లి, సంగారెడ్డి, జనగామ, మంచిర్యాల, పెద్దపల్లి, సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులున్నాయి. ఒక్క ఆదిలాబాద్​ జిల్లాలో మాత్రమే అధిక వర్షపాతం నమోదుకాగా.. మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మొత్తంగా ఈ పాటికి 202.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా.. 172.8 మిల్లీమీటర్లే నమోదు కావడం గమనార్హం. ఇప్పటివరకు 15 శాతం లోటు వర్షపాతం రికార్డయింది.   

మాన్సూన్​ ఫెయిల్​ కాలే

ఈ ఏడాది రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు చాలా తొందరగా ప్రవేశించాయి. పసిఫిక్​ మహా సముద్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో కేరళ అటు నుంచి మన రాష్ట్రంలోకి చాలా వేగంగా వచ్చాయి. అయితే, రుతుపవనాలు మన రాష్ట్రంపై స్థిరంగా ఉండడం లేదు. గాలుల వేగం ఎక్కువగా ఉంది. 

రుతుపవనాలు ఎంటరైనప్పుడు పశ్చిమ మధ్య బంగాళాఖాతం (కోస్తాంధ్ర)లో రెండు మూడు అల్పపీడనాలు ఏర్పడితే.. అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడి రాష్ట్రంపై ఉన్న గాలులు స్థిరంగా ఉండి మేఘాలు ఏర్పడి వర్షం పడుతుంది. కానీ, ఈ ఏడాది ఆ పరిస్థితులు లేవు. అయితే, ఈ నెల మూడు లేదా నాలుగో వారంలో అల్పపీడనాలు ఏర్పడేందుకు అవకాశాలున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు పడనంత మాత్రాన మాన్సూన్​ ఫెయిల్​ అయినట్టు కాదు. రుతుపవనాలు చాలా చురుగ్గా ఉన్నాయి. 

- జీఎన్​ఆర్​ఎస్​ శ్రీనివాస రావు, మీటియోరాలజిస్ట్​ బీ, ఐఎండీ హైదరాబాద్​