- 10 రౌండ్లు.. 42 టేబుళ్లు
- రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు
- మొదటిగా పోస్టల్ బ్యాలెట్, తర్వాత షేక్ పేట డివిజన్
- యూసుఫ్ గూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి
- కౌంటింగ్ విధుల్లో 186 మంది సిబ్బంది
- లెక్కింపు కేంద్రం వద్ద 250 మంది పోలీసులతో బందోబస్తు
- ఫలితాలు ఈసీ వెబ్ సైట్ లో ఎప్పటికప్పుడు అప్డేట్
హైదరాబాద్: హోరాహోరీగా సాగిన జూబ్లీహిల్స్ శాసన సభ స్థానం ఉప ఎన్నిక ఫలితం మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఉదయం 8 గంటలకు యూసూఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఉదయం 11 గంటల కల్లా ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు కోసం 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మొదటిగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు.
ఈ సెగ్మెంట్ పరిధిలో 105 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. షేక్ పేట డివిజన్ ఈవీఎం ఓట్లను మొదట లెక్కించనున్నారు. కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారి ఆర్వీ కర్ణన్ ఇవాళ పరిశీలించారు. ఓట్ల లెక్కింపు విధుల్లో 186 మంది సిబ్బంది పాల్గొంటారు. లెక్కింపు కేంద్రం వద్ద 250 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేయనున్నారు. ఆ పరిసరాల్లో 144వ సెక్షన్ అమల్లో ఉంటుంది.
జూబ్లీహిల్స్ బైపోల్–2025
- మొత్తం ఓట్లు 4,01,365
- పోలైన ఓట్లు 1,94,631
- అభ్యర్థుల సంఖ్య 58
ఏజెంట్లను, అభ్యర్థులను అనుమతిస్తం
ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి కేవలం కౌంటింగ్ ఏజెంట్ల, అభ్యర్థులను మాత్రమే అనుమతిస్తామని జూబ్లీహిల్స్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచినందున , 186 మంది కౌంటింగ్ సిబ్బంది విధుల్లో ఉంటారన్నారు. ఇందుకోసం ఎన్నికల కమిషన్ నుంచి ప్రత్యేక అనుమతి పొందినట్టు చెప్పారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్‌తో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు. 407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లు లెక్కిస్తామన్నారు.
ఫలితాలను ఎప్పటికప్పుడు ఈసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తాం. మీడియాకు ప్రత్యేకంగా ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారు. జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ.. 15 ప్లాటూన్ల సిబ్బందిని రప్పిస్తున్నామన్నారు. 250 మంది పోలీసులు విధుల్లో ఉంటారని వివరించారు.
