ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజుల పెంపుకు నో చెప్పిన హైకోర్టు

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజుల పెంపుకు నో చెప్పిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ఫీజుల పెంపు కోసం హైకోర్టును ఆశ్రయించిన పలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు ఎదురుదెబ్బ తగిలింది. ఫీజుల పెంపునకు నిరాకరించిన హైకోర్టు.. ఈ వ్యవహారంపై కసరత్తు చేసి నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌సీ)కి తేల్చి చెప్పింది. తమ నిర్ణయాన్ని కమిటీ ప్రభుత్వానికి నివేదించాలని, దానిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు ఆరు వారాలు గడువు విధించింది. 

అయితే ప్రభుత్వం తీసుకునే ఫీజుల పెంపు నిర్ణయం తాము వెలువరించే తుది తీర్పుకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కాలేజీల్లో అడ్మిషన్లు పొందే విద్యార్థులకు ముందుగా తెలియజేయాలని, అధికారిక వెబ్‌‌‌‌సైట్, ఇతర మార్గాల్లో సమాచారం ఇవ్వాలని కన్వీనర్‌‌‌‌ను ఆదేశించింది. అలాగే టీఏఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌సీ, రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలతో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 12కు వాయిదా వేసింది.

ఇరు పక్షాల వాదనలు

ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 2025–26 విద్యా సంవత్సరానికి గత బ్లాక్ పీరియడ్ ఫీజులే వర్తిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం జీవో 26 జారీ చేసింది. ఆ జీవోను రద్దు చేయాలని, తాము గతేడాది డిసెంబర్‌‌‌‌లోనే ఫీజుల పెంపుపై కమిటీకి ప్రతిపాదనలు ఇచ్చిన నేపథ్యంలో ఫీజుల పెంపుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గోకరాజు రంగరాజు, గురునానక్ సహా 12 ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ దీనిపై విచారణ చేపట్టారు.

గత డిసెంబర్‌‌‌‌లోనే ఫీజులు పెంచాలని కమిటీకి ప్రతిపాదనలు పంపామని, మార్చిలో కమిటీ సమావేశం కూడా నిర్వహించిందని, ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడం వల్ల కాలేజీలు నష్టపోతున్నాయని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్ రెడ్డి వాదించారు. కమిటీ తరఫున సీనియర్ న్యాయవాది పి.శ్రీరఘురాం వాదిస్తూ.. టీఏఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌సీకి కాలేజీలు ఐదు వేల పేజీల ప్రతిపాదనలు పంపాయని, వీటి పరిశీలన పూర్తి చేసి తగిన నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుందని చెప్పారు.

 ప్రభుత్వ న్యాయవాది రాహుల్ రెడ్డి స్పందిస్తూ, ముగిసిన విద్యా సంవత్సరంలోని ఫీజుల కంటే దాదాపు 70 శాతం నుంచి 90 శాతం పెంచాలని కాలేజీలు ప్రతిపాదనలు చేశాయన్నారు. కాలేజీలు విద్యావ్యాపారం చేయడానికి వీల్లేదన్నారు. వాదనలు విన్న హైకోర్టు ఫీజుల పెంపునకు అనుమతి ఇవ్వబోమని శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. కమిటీ ముందున్న కాలేజీల ప్రతిపాదనలను పరిశీలించి ప్రభుత్వానికి ఆరు వారాల్లో రిపోర్టు ఇవ్వాలని తెలిపింది.

రిజిస్టర్‌‌‌‌లో మెంబర్స్ సంతకాలు లేవు

‘‘విస్తృతాధికారాలతో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపు ఉత్తర్వులు టీఏఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌సీ ఇవ్వడానికి లేదు. ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు చేయాలి. ప్రభుత్వం తుదినిర్ణయం తీసుకుంటుంది. ఈ పరిస్థితుల్లో కాలేజీల అభ్యంతరాలపై ఉత్తర్వులు ఇవ్వబోము. ప్రభుత్వం, టీఏఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌సీ వాదనలు విన్నాకే తగిన ఉత్తర్వులు ఇస్తం. టీఏఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌సీ మీటింగ్ రికార్డుల్లో కాలేజీల వినతులు నమోదు చేశారని చెప్పి ఆదేశాలు ఇవ్వడం సాధ్యం కాదు. రిజిస్టర్‌‌‌‌లో నమోదు చేయడం పరిపాలన అంశం. కాలేజీ ప్రతినిధులతో సమావేశం జరిగినట్లు రిజిస్టర్‌‌‌‌లో నమోదు చేసిన విషయాలను ఆధారంగా చేసుకొని ఫీజుల పెంపు వీలుకాదు. 

రిజిస్టర్ పరిశీలన చేస్తే అందులో మెంబర్స్ సంతకాలు కూడా లేవు. కాలేజీల ప్రతిపాదనలు సుప్రీం కోర్టు, హైకోర్టుల గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌కు భిన్నంగా ఉన్నాయని రిజిస్టర్‌‌‌‌లో ఉంది. కాలేజీల ప్రతిపాదనలపై ప్రభుత్వం అధికారులతో కమిటీ వేసి స్టడీ చేయాలని అందులో పేర్కొన్నదంటే ఫీజుల పెంపునకు టీఏఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌సీ నిర్ణయం తీసుకోలేదని స్పష్టమవుతున్నది’’ అని హైకోర్టు తెలిపింది. అలాగే టీఏఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌సీ నిర్ణయం తీసుకోవాలని, ఆపై రాష్ట్రం తుదినిర్ణయం తీసుకోవాలని, ఇవన్నీ ఆరు వారాల్లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. విచారణను ఆగస్టు 12కి వాయిదా వేసింది.