
- మొదటిసారి జిల్లాలో విపత్తు రక్షణ టీమ్
- గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు చేపట్టిన కలెక్టర్
- అందుబాటులోకి బోట్, లైఫ్ జాకెట్స్
ఆసిఫాబాద్, వెలుగు: వానాకాలం వచ్చిందంటే చాలు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా మారుమూల గ్రామాల ప్రజలు వణికిపోతుంటారు. వరదలు, బ్యాక్ వాటర్ తో గ్రామాలు జలదిగ్బంధమై బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. జిల్లాలో రెస్క్యూ టీమ్‌ను సిద్ధం చేసింది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో రూ.5 లక్షల వ్యయంతో సమకూర్చిన 4 సీట్లతో బోటు, 50 లైఫ్ జాకెట్లు, 20 రబ్బర్ ట్యూబ్‌లు, 1 కోత మెషీన్‌ను మూడు రోజుల క్రితం కలెక్టరేట్లో కలెక్టర్వెంకటేశ్ధోత్రే ఎమ్మెల్సీ దండే విఠల్, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారీ, ఎం.డేవిడ్‌తో కలిసి పోలీస్, అగ్నిమాపక శాఖలకు అందించారు. భారీ వర్షాలు, వరదలు, విపత్తుల సమయంలో ప్రజలను రక్షించేందుకు, ఆస్తులు నష్టపోకుండా రెస్క్యూ సేవలు అందించేందుకు ఈ పరికరాలు ఎంతో ఉపయోగపడనున్నాయి.
ఇప్పుడు జిల్లాలో ప్రత్యేకంగా టీమ్
రహదారులు, వంతెనలు, బ్రిడ్జిలు లేక జిల్లాలోని అనేక గ్రామాల ప్రజలు వానాకాలం ఇబ్బందులు పడుతున్నారు. పనుల కోసం వరదలను లెక్కచేయకుండా వెళ్లి ఒక్కోసారి ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లాలో విపత్తులు వచ్చినప్పుడు రెస్క్యూ సేవలు అందించేందుకు మంచిర్యాల నుంచి సింగరేణి సంస్థకు చెందిన బృందం వచ్చేది. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా జిల్లాలో రెస్క్యూ టీమ్ ఏర్పాటు చేశారు. స్విమ్మింగ్‌లో నైపుణ్యం ఉన్న 16 మంది పోలీస్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించి మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇప్పటికే అన్ని రకాల శిక్షణ ఇచ్చారు. ఈ 16 మందితో రెండు బృందాలు ఏర్పాటు చేసి ఆసిఫాబాద్, కాగజ్ నగర్ డివిజన్లకు కేటాయించారు. వరదల సమయంలో రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖల సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు
జిల్లాలో వర్షాల నేపథ్యంలోనే కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్8500844365 కాల్ చేయాలని కలెక్టర్సూచించారు. వరద పరిస్థితులను ప్రజలకు ముందస్తుగా తెలియజేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో 151 కటాఫ్ గ్రామాలను గుర్తించిన అధికార యంత్రాంగం.. ప్రాణహిత, వార్ధా, పెద్దవాగు సహా అనేక చిన్న వాగుల పరివాహక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టింది.
యంత్రాంగం సిద్ధంగా ఉంది
వర్షాకాలంలో వరదలు, బ్యాక్ వాటర్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయాల్లో వారి ప్రాణాలు, ఆస్తులు కాపాడేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. రెస్క్యూ టీమ్‌లు నిత్యం అందుబాటులో ఉంటూ రక్షణ చర్యలు చర్యలు చేపట్టాలా ఆదేశాలిచ్చాం. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం కంట్రోల్ రూమ్‌కు కాల్ చేయాలి. వరద సమయాల్లో రెవెన్యూ, పోలీస్, పంచాయతీ అధికారులకు సమాచారం అందించాలి.
కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే