
- సర్కార్‌కు బీసీ సంఘాలన్నీ అండగా ఉండాలని పిలుపు
- చట్టసభల మెట్లు తొక్కని కులాల కోసమే: వాకిటి శ్రీహరి
- రాజకీయం చేయొద్దు.. అందరూ మద్దతివ్వండి: కేకే
- గాంధీభవన్‌లో కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తే సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత తప్పదని బీఆర్ఎస్, బీజేపీని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. కామారెడ్డి డిక్లరేషన్ నుంచి ఇప్పటి వరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ఎప్పుడూ వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు. ‘‘స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించాం. వీటికి అడ్డుతగిలి బీసీల నోటికాడి ముద్దను గుంజుకోవద్దని బీఆర్ఎస్, బీజేపీకి విజ్ఞప్తి చేస్తున్నా.
ఒకవేళ మీరు రిజర్వేషన్లను అడ్డుకుంటే.. మీ సొంత పార్టీ నేతల నుంచే మీకు వ్యతిరేకత తప్పదు’’ అని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీసీ కుల సంఘాలన్నీ ఏకమై జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఏ విధంగా పోరాడాయో.. ఇప్పుడు రిజర్వేషన్ల సాధన కోసం కూడా ఆ సంఘాలన్నీ ప్రభుత్వానికి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించిన నేప థ్యంలో శుక్రవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు నిర్వహించాయి.
ఈ వేడుకల్లో మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావుతో కలిసి మంత్రి పొన్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సామాజిక న్యాయానికి చాంపియన్ కాంగ్రెస్. సీఎం రెడ్డి సామాజి కవర్గం నేత అయితే పీసీసీ చీఫ్బీసీ నేత. ఇది మా పార్టీ లో సామాజిక న్యాయం. రాష్ట్రంలో చేపట్టిన కులగణన, రిజర్వేషన్ల పెంపు సామాజిక న్యాయం సాధించడానికి మార్గం సుగమం చేస్తాయి” అని పేర్కొన్నారు. దెయ్యా లు ఉన్నాయని అంటున్న పార్టీలో వాటి గురించే చర్చ చేసుకోవాలని, కానీ బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవద్దని బీఆర్ఎస్‌ను ఉద్దేశించి అన్నారు.
‘‘బీసీలకు సీఎం పదవి ఇస్తానని చెప్పిన బీజేపీ.. ఎన్నికల సమయంలో బీసీ నేత బండి సంజయ్‌ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఆ పార్టీకి రాష్ట్రంలో నలుగురు బీసీ ఎంపీ లున్నా, రాజాసింగ్ లాంటి వాళ్లు ఎమ్మెల్యేలుగా ఉన్నా.. వారిని కాదని అగ్రకులానికి చెందిన వ్యక్తికే అధ్యక్ష పదవి ఇచ్చారు. చివరకు రాజాసింగ్ రాజీనామాను ఆమో దించి బీసీల వ్యతిరేక పార్టీగా బీజేపీ మరో సారి తన అసలు స్వభావాన్ని చాటుకుంది” అని
మండిపడ్డారు.
ప్రతిపక్షాలు సహకరించాలి: వాకిటి శ్రీహరి
ఇప్పటి వరకు చట్టసభల మెట్లు తొక్కని కులాల కోసమే బీసీ రిజర్వేషన్లను పెంచామని మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. ‘‘ఇప్పటికే బీసీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించాం. దానికి ఆమోదం తెలిపి, 9వ షెడ్యూల్‌లో చేర్చాలని ప్రధాని మోదీని కోరాం. ఒకవేళ అందులో చేర్చడం ఆలస్యమైనా లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేస్తాం” అని తెలిపారు.
బీసీ రాజ్యాధికారం దిశగా గొప్ప ముందడుగు: కేకే
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం పార్టీలకు అతీతమైందని.. దీనిపై ఎవరూ రాజకీయం చేయొద్దని, అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు విజ్ఞప్తి చేశారు. ‘అన్ని పార్టీలకు చేతులు జోడించి వేడుకుంటున్నా.. బీసీ రిజర్వేషన్లకు అడ్డుతగలకండి’ అని విన్నవించారు. ‘‘ఇంతటి చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులకు అభినందనలు.
దేశంలో మండల్ కమిషన్ తర్వాత బీసీలకు వచ్చిన మరో మంచి అవకాశమిది. తెలంగాణలో బీసీ రాజ్యాధికారం దిశగా ఇది గొప్ప ముందడుగు. ఈ విషయంలో ప్రభుత్వానికి పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు ఇవ్వాలి’’ అని పిలుపునిచ్చారు. ‘‘బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం చట్టం ప్రకారం ముందుకెళ్తున్నది. 42 శాతం రిజర్వేషన్లను ఆర్డినెన్స్ ద్వారా అమలుచేసే వీలుంది” అని పేర్కొన్నారు.
గాంధీభవన్‌లో నేతల సంబురాలు
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో శుక్రవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. పటాకులు కాల్చుతూ, స్వీట్లు తినిపిస్తూ, డ్యాన్స్‌లు చేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంబురాల్లో బీసీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.