కేసీఆర్ ఉద్యోగం తీసేస్తేనే జాబ్స్​ వస్తయి

కేసీఆర్ ఉద్యోగం తీసేస్తేనే జాబ్స్​ వస్తయి

ఉద్యమకారుడని పాలన చేతికిస్తే నట్టేట్లో ముంచిన్రు: షర్మిల
హైదరాబాద్‌, వెలుగు: సీఎం కేసీఆర్‌ ఉద్యోగం తీసేస్తేనే తెలంగాణ నిరుద్యోగులకు జాబ్స్​ వస్తాయని వైఎస్సార్‌ టీపీ చీఫ్‌ షర్మిల అన్నారు. తెలంగాణలో వడ్లు కొంటరో కొనరో తెలియని పరిస్థితి ఉందన్నారు. షర్మిల ప్రారంభించిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర10వ రోజు శుక్రవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కొనసాగింది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర సీతారామ్ పేట, నోముల, లింగంపల్లి క్రాస్, మంచాల, చందకాన్ గూడ, అస్మత్ పూర్ మీదుగా 12.8 కిలోమీటర్లు సాగింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. సమాజం ముందు నిరుద్యోగులు తలెత్తుకొని తిరగలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కానీ దున్నపోతు మీద వాన పడినట్లు కేసీఆర్‌లో మాత్రం చలనమే లేదన్నారు. తెలంగాణ రాకముందు ఇంటికో ఉద్యోగం ఇస్తమన్న కేసీఆర్ ఆ హామీ మరిచారని దుయ్యబట్టారు. పోలీస్‌ ఉద్యోగాలు భర్తీ చేసి, ఇంటికి కాపలాగా ఉండేందుకు పెట్టుకున్నారన్నారు. ఉద్యమకారుడని పాలన చేతికిస్తే నట్టేట్లో ముంచేశారని, కొత్త ఉద్యోగాలు ఇవ్వడం మానేసి, ఉన్నవి తీసేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆరోగ్యశ్రీ పథకాన్ని కేసీఆర్ అనారోగ్యశ్రీగా మార్చేశారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ లేదని ఆరోపించారు. ‘‘డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తమన్నరు. ఒక్కరికైనా ఇల్లు, పింఛన్ వచ్చిందా? కేజీ టు పీజీ ఉచిత విద్యతో ఎంత మంది చదువుకుంటున్నరు. కేసీఆర్​ప్రజలను మోసం చేసి పాలిస్తున్నరు. గ్యాస్, కరెంట్, పెట్రోల్, డీజిల్, కూరగాయలు ఇలా అన్నీ పేదవాడిని బతకుండా చేస్తున్నయి. వైఎస్సార్ హయాంలో గ్యాస్ ధర రూ.50 పెరిగితే, ఆ భారం రాష్ట్ర సర్కారే భరించింది. ఏ ప్రభుత్వమైనా ఇప్పుడు అలా చేస్తుందా?’’ అని షర్మిల ప్రశ్నించారు. ప్రజలకు మేలు చేసేందుకే పార్టీని పెట్టానని, బడుగు బలహీనవర్గాల కోసం కొట్లాడుతానన్నారు.