అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తా : జో బైడెన్

అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తా : జో బైడెన్

వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ రెండోసారి అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్, కమలా హారిస్ కూడా మళ్లీ అదే పదవికి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. మంగళవారం ఈ మేరకు బైడెన్ క్యాంపెయిన్ టీం 3 నిమిషాల వీడియోను ట్విట్టర్​లో రిలీజ్ చేసింది. ట్రంప్ ఓటమి తర్వాత 2021 జనవరిలో అమెరికా క్యాపిటల్ బిల్డింగ్​పై ఆయన మద్దతుదారులు దాడిచేసిన దృశ్యాలతో ఈ వీడియో ప్రారంభమైంది. 

ఇందులో బైడెన్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, ఆ బాధ్యత నెరవేర్చేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు.  రిపబ్లికన్ పార్టీ తీవ్రవాదంపై పోరాడేందుకు తనకు మద్దతు ఇవ్వాలన్నారు. అయితే, డెమోక్రటిక్ పార్టీ సీనియర్ నేత అయిన బైడెన్ వయస్సు ప్రస్తుతం 80 ఏండ్లు. రెండోసారి అధ్యక్షుడిగా గెలిస్తే పదవీకాలం పూర్తయ్యేసరికి ఆయనకు 86 ఏండ్లు వస్తాయి. ఇంత వృద్ధాప్యంలో ఆయన బాధ్యతలు నెరవేర్చగలరా? అన్న విషయంలో చాలామంది అమెరికన్లు సందేహపడే అవకాశాలు ఉన్నాయి. 


మరోమారు బైడెన్ వర్సెస్ ట్రంప్? 


అమెరికా కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం2024 నవంబర్ లో ఎన్నికలు జరగనున్నాయి. అంతకుముందు దేశంలో రెండు ప్రధాన పార్టీలైన డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీల్లో అంతర్గత ఎన్నికల ద్వారా ప్రెసిడెంట్ అభ్యర్థిని ఎన్నుకోవాల్సి ఉంది. అయితే, డెమోక్రటిక్ పార్టీలో బైడెన్ ఏకగ్రీవంగానే అభ్యర్థిగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక రిపబ్లికన్ పార్టీ నేత ట్రంప్ (76) కూడా ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. దీంతో వచ్చే అధ్యక్ష ఎన్నికలు కూడా మళ్లీ బైడెన్ వర్సెస్ ట్రంప్ అన్నట్లుగా ఉండొచ్చని భావిస్తున్నారు.