డొనాల్డ్ ట్రంప్ ఓ ఫూల్: జో బిడెన్

డొనాల్డ్ ట్రంప్ ఓ ఫూల్: జో బిడెన్

వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఓ అబ్జల్యూట్ ఫూల్ అని డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ ఘాటుగా విమర్శించారు. రీసెంట్ గా ఓ పబ్లిక్ ఈవెంట్ లో ట్రంప్ పాల్గొన్నారు. కరోనాకు భయపడి జాగ్రత్త చర్యలుగా మాస్క్ లు కట్టుకోవాల్సిన అవసరం ఉన్నా ఆ ఈవెంట్ లో ట్రంప్ మాత్రం మాస్క్ ధరించలేదు. ఇది చాలా చర్చనీయాంశమైంది. ట్రంప్ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, ఆయనో మూర్ఖుడని దెప్పి పొడిచారు. ‘ఆయనో ఫూల్. ఆ విధంగా మాట్లాడటం అంటే సంపూర్ణంగా మూర్ఖుడనే అనుకోవాలి. ఈ ప్రపంచంలో పేరొందిన ప్రతి డాక్టర్ కూడా ప్రజల రద్దీ ఎక్కువగా ఉన్న చోట మాస్క్ తప్పనిసరిగా కట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నారు’ అని ఓ మీడియా చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిడెన్ చెప్పారు.

బిడెన్ వ్యాఖ్యలపై వైట్ హౌస్ వర్గాలు స్పందించాయి. ‘జో బేసెమెంట్ నుంచి బయటకు రావడం చూసి ప్రెసిడెంట్ ట్రంప్ ఉత్సాహంగా ఉన్నారు. ఇది కొంచెం విచిత్రం అయినప్పటికీ బిడెన్ బేస్ మెంట్ లో తన భార్య దగ్గర మాస్క్ కట్టుకోలేదు. ఆయన ఎప్పుడైతే బయటకు వచ్చారో.. అప్పట్నుంచి సోషల్ డిస్టెన్సింగ్ కోసం మాస్క్ ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కొంత వ్యత్యాసం ఉందని నేను భావిస్తున్నా’ అని వైట్ హౌస్ అధికార ప్రతినిధి కేలీ మెక్ ఎననీ ధీటుగా బదులిచ్చారు. ట్రంప్ ఎవరినీ సిగ్గుపడేలా చేయట్లేదని కేలీ పేర్కొన్నారు. మహమ్మారి విజృంభణ ప్రారంభమైన పలు వారాల తర్వాత బిడెన్ బయటకు వచ్చారని, ఇన్నాళ్లూ ఆయన ఇంటికే పరిమితమయ్యారని ట్రంప్ ఇటీవలే కామెంట్ చేసిన విషయం తెలిసిందే. వరల్డ్ వైడ్ గా విలయతాండవం చేస్తున్న కరోనా రక్కసి అమెరికానూ గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే.