
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రాణాంతక ప్రొస్టేట్ క్యాన్సర్ వ్యాధి సోకింది. ఈ విషయాన్ని బైడెన్ కార్యాలయం వెల్లడించింది. మూత్ర సంబంధిత సమస్యల కారణంగా బైడెన్ గత వారం వైద్యులను సంప్రదించారు. పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. బైడెన్‌కు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారించారు. క్యాన్సర్ కణాలు ఆయన ఎముకలకు వ్యాపించినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం బైడెన్‌కు క్యాన్సర్ తీవ్ర దశలో ఉన్నప్పటికీ హార్మోన్-సెన్సిటివ్‌గా ఉండటంతో సమర్థవంతంగా చికిత్స అందజేసేందుకు అవకాశం ఉందని తెలిపారు.
వైద్యులు బైడెన్ కుటుంబ సభ్యులతో ఎలాంటి చికిత్స అందించాలనే దానిపై చర్చిస్తున్నారని ఆయన కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. బైడెన్‌కు సోకిన ప్రోస్టేట్ క్యాన్సర్‌ను గ్లీసన్ స్కోర్ ఉపయోగించి గ్రేడింగ్ చేస్తారు. ఇది 1 నుంచి 10 వరకు ఉంటుంది. బైడెన్ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం ఆయనకు గ్లీసన్ స్కోర్ 9గా ఉందని.. అంటే ఇది చాలా తీవ్రమైన దశ అని అర్ధం. బైడెన్‌కు నిర్ధారణ అయిన మెటాస్టాసైజ్డ్ క్యాన్సర్ చికిత్స చాలా కష్టమని.. వ్యాధిని పూర్తిగా తొలగించడం కష్టమని వైద్యులు పేర్కొన్నారు. జో బైడెన్‌కు క్యాన్సర్ నిర్ధారణ కావడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
►ALSO READ | ట్రంప్ సలహాదారులుగా మాజీ టెర్రరిస్టులు.. వెల్లడించిన జర్నలిస్ట్ లారా లూమర్..!
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. బైడెన్‌కు క్యాన్సర్ నిర్ధారణ అయిందని తెలిసి చాలా బాధపడ్డానని, ఆయన త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. కాగా.. వయస్సు, ఆరోగ్యం దృష్ట్యా 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి బైడెన్ తప్పుకున్న విషయం తెలిసిందే. డెమొక్రటిక్ పార్టీ నుంచి బైడెన్ స్థానంలో కమలా హ్యారీస్ రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ పై పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించి.. రెండో సారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.