IND vs ENG 2025: లార్డ్స్ టెస్టులో రూట్ సెంచరీ.. ద్రవిడ్, స్మిత్ లను వెనక్కి నెట్టి టాప్-5 లోకి

IND vs ENG 2025: లార్డ్స్ టెస్టులో రూట్ సెంచరీ.. ద్రవిడ్, స్మిత్ లను వెనక్కి నెట్టి టాప్-5 లోకి

టీమిండియాతో జరుగుతున్న లార్డ్స్ టెస్ట్ లో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సెంచరీతో సత్తా చాటాడు. ఓవర్ నైట్ స్కోర్ 99 పరుగుల వద్ద రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన రూట్.. బుమ్రా వేసిన తొలి బంతికే థర్డ్ మ్యాన్ దిశగా ఫోర్ కొట్టి 192 బంతుల్లో తన సెంచరీ  మార్క్ అందుకున్నాడు. టీమిండియాపై రూట్ కు ఇది 11 వ సెంచరీ కాగా ఓవరాల్ గా టెస్ట్ కెరీర్ లో 37 వ సెంచరీ. ఈ సెంచరీతో రూట్ టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్ కు ముందు వరకు 36 సెంచరీలతో స్మిత్, ద్రవిడ్ లతో సమానంగా ఉన్న రూట్ లార్డ్స్ లో 100 పరుగులు కొట్టి 37 సెంచరీలతో టాప్-5 లోకి వచ్చేశాడు. 

156 మ్యాచ్ ల్లో 284 ఇన్నింగ్స్ ల్లో రూట్ ఈ ఘనతను అందుకున్నాడు. టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల లిస్ట్ లో టీమిండియా దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ 51 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. కల్లిస్ (45), పాంటింగ్ (41), సంగక్కర (38) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. తొలి రెండు టెస్టుల్లో పెద్దగా ఆకట్టుకొని రూట్ మూడో టెస్టులో సెంచరీతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. రూట్ సెంచరీ చేయడంతో ప్రస్తుతం ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 86 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. రూట్ (103), స్మిత్ (1) క్రీజ్ లో ఉన్నారు. 

Also Read  : సెంచరీకి ముందు రూట్‌ను భయపెట్టిన జడేజా

తొలి రోజు జరిగిన మ్యాచ్ విషయానికి వస్తే గురువారం మొదలైన మూడో టెస్ట్‌‌లో ఇంగ్లండ్‌‌కు శుభారంభం లభించింది. జో రూట్‌‌ (191 బాల్స్‌‌లో 9 ఫోర్లతో 99 బ్యాటింగ్‌‌), ఒలీ పోప్‌‌ (44) రాణించడంతో.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌లో 83 ఓవర్లలో 251/4 స్కోరు చేసింది. రూట్‌‌తో పాటు బెన్‌‌ స్టోక్స్‌‌ (39 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నాడు. నితీశ్‌‌ రెడ్డి రెండు వికెట్లు తీశాడు. బుమ్రా, జడేజాలకు తలో వికెట్ దక్కింది.