విండీస్ బ్యాట్స్మన్ విధ్వంసం..

విండీస్ బ్యాట్స్మన్ విధ్వంసం..

విండీస్ బ్యాట్స్మన్ విధ్వంసం సృష్టించాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20ల్లో జాన్సన్ చార్లెస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 39 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ సాధించాడు.  మొత్తం 46 బంతుల్లో 118 పరుగులతో సునామీ సృష్టించాడు. ఇందులో ఏకంగా 10 ఫోర్లు, 11 సిక్సులు ఉండటం విశేషం. 

వెస్టిండీస్ తొలి వికెట్ కోల్పోయిన తర్వాత క్రీజులోకి వచ్చిన చార్లెస్..స్టార్టింగ్ నుంచే దూకుడుగా ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ నేపథ్యంలో 23 బంతుల్లో అర్థ సెంచరీ చేసిన చార్లెస్..మరో 16 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. 

విధ్వంసకర శతకంతో చార్లెస్‌ పలు  రికార్డులను సృష్టించాడు. ఇంటర్నేషనల్ టీ20ల్లో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన విండీస్ ప్లేయర్గా చార్లెస్ రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉండేది.  2016లో ముంబైలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20లో గేల్‌ 47 బంతుల్లో సెంచరీ సాధించాడు. విదేశీ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన విండీస్‌ క్రికెటర్‌గా చార్లెస్(118) నిలిచాడు. అంతకుముందు కూడా ఈ రికార్డు కూడా క్రిస్‌ గేల్‌ పేరిటే ఉండేది. 2007లో దక్షిణాఫ్రికా పైనే గేల్‌ 117 పరుగులు చేశాడు. వరల్డ్  క్రికెట్‌లో టీ20ల్లో అత్యంత వేగవంతంగా సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా చార్లెస్‌ నిలిచాడు .అంతకుముందు డేవిడ్‌ మిల్లర్‌ 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 

జాన్సన్ చార్లెస్‌ సూపర్ సెంచరీతో వెస్టిండీస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 258 పరుగుల భారీ స్కోరు సాధించింది. చార్లెస్‌తో పాటు ఓపెనర్‌ కైల్‌ మైర్స్‌ 51 పరుగులు చేశాడు. చివర్లో షెపర్డ్ 18 బంతుల్లో 41 రన్స్ చేశాడు.