2024లో జాయింట్ స్పేస్ మిషన్

2024లో జాయింట్ స్పేస్ మిషన్
  • రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు 

వాషింగ్టన్: ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇండియా, అమెరికా మధ్య గురువారం పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. అంతరిక్ష రంగంలో కలిసి పని చేసేందుకు నాసా, ఇస్రో చేతులు కలిపాయని వైట్​హౌస్ ప్రకటించింది. 2024లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సంయుక్త అంతరిక్ష యాత్రను ప్రారంభించేందుకు నాసా, ఇస్రో అంగీకరించాయని పేర్కొంది. నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్ ప్రాజెక్టు ఒప్పందంపైనా ఇరు దేశాలు సంతకాలు చేశాయని వివరించింది. మానవ అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన స్ట్రాటజిక్ ఫ్రేమ్‌‌వర్క్‌‌ను నాసా, -ఇస్రో కలిసి డెవలప్ చేస్తాయని తెలిపింది.

సెమీ కండక్టర్ల తయారీకి మద్దతుఇండియాలో సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ డెవలప్ చేసేందుకు యూఎస్ కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయని వైట్ హౌస్ తెలిపింది. మైక్రాన్ టెక్నాలజీ, ఇండియన్ నేషనల్ సెమీ కండక్టర్ మిషన్ మద్దతుతో రూ.6,560 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు నిర్ణయించినట్లు వివరించింది. కమర్షియలైజేషన్, ఇన్నోవేషన్ కోసం కొత్త సెమీ కండక్టర్ సెంటర్​ను ఇండియాలో ప్రారంభించేందుకు యూఎస్ అంగీకరించిందని తెలిపింది.   క్వాంటం కో ఆర్డినేషన్ మెకానిజం ఏర్పాటు
అడ్వాన్స్ టెక్నాలజీ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం ఇన్ఫర్మేషన్ సైన్స్​లో ఇండియా, అమెరికా కలిసి ఫస్ట్​టైం జాయింట్ ఇండో యూఎస్ క్వాంటం కో ఆర్డినేషన్ మెకానిజం ఏర్పాటుకు అంగీకరించాయి. 

జీఈ ఏరోస్పేస్​తో హెచ్ఏఎల్ డీల్

దేశీయంగా ఫైటర్‌‌ జెట్‌‌ ఇంజిన్ల తయారీకి జనరల్ ఎలక్ట్రిక్స్ (జీఈ) ఏరోస్పేస్‌‌తో హిందుస్థాన్‌‌ ఏరోనాటిక్స్‌‌ లిమిటెడ్‌‌ (హెచ్​ఏఎల్) ఒప్పందం కుదుర్చుకుంది. జీఈ ఏరోస్పేస్‌‌కు చెందిన ఎఫ్​414 ఇంజిన్లను హెచ్‌‌ఏఎల్‌‌తో కలిసి ఇండియాలో తయారు చేసేందుకు ఈ ఒప్పందం కుదిరిందని ఆ కంపెనీ చైర్మన్ లారెన్స్ కల్ప్ ప్రకటించారు. ఈ ఇంజిన్లను తేజస్‌‌ మార్క్‌‌-2 ఫైటర్​ జెట్స్​లో అమరుస్తారని తెలిపారు. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. 

ఇక హెచ్​1బీ వీసా రెన్యువల్ ఈజీ

అమెరికాలో హెచ్‌‌-1బీ వీసా మీద ప‌‌నిచేస్తున్న ఇండియన్స్​కు బైడెన్ స‌‌ర్కార్ గుడ్ ​న్యూస్​ చెప్పింది. నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు అమెరికాలోనే త‌‌మ వీసాను రెన్యువ‌‌ల్ చేసుకునే అవ‌‌కాశం కల్పించేందుకు నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఇండియన్స్​కు లాభం చేకూరనుంది. వీసా రెన్యువ‌‌ల్ కోసం వారు విదేశాల‌‌కు వెళ్లకుండా.. అమెరికాలోనే రెన్యువ‌‌ల్ చేసుకోవచ్చు. అమెరికా ప్రభుత్వం త్వరలో దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్ కొనసాగుతున్నది. త్వరలోనే పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అమెరికా విదేశాంగ శాఖ ప్రయత్నిస్తున్నది. అలాగే బెంగళూరు, అహ్మదాబాద్​లలో కొత్త అమెరికా కాన్సులేట్​లు ప్రారంభించేందుకు కూడా ఒప్పందం కుదిరింది.