కాళేశ్వరం ముంపుపై మహారాష్ట్రలో జాయింట్ సర్వే

కాళేశ్వరం ముంపుపై మహారాష్ట్రలో జాయింట్ సర్వే

జయశంకర్ భూపాలపల్లి/మహదేవ్ పూర్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్​బ్యాక్ వాటర్​తో మహారాష్ట్రలోని బార్డర్ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దీనిపై మహారాష్ట్ర, తెలంగాణ ఆఫీసర్లు జాయింట్ సర్వే చేపట్టారు. మేటిగడ్డ బ్యారేజ్​ బ్యాక్​ వాటర్​తో నోటిఫై చేసిన భూములే కాకుండా మరికొన్ని భూములు మునుగుతున్నాయని అక్కడి రైతులు కొంత కాలంగా ఆందోళన చేస్తున్నారు. సోమవారం ప్రారంభమైన సర్వే 12వ తేదీ వరకు కొనసాగనుంది. ఏయే గ్రామాల్లో ఎంత మేరకు పంట భూములు మునుగుతున్నాయో గుర్తించి అధికారులు లిస్ట్​తయారుచేస్తున్నారని బాధిత రైతులు తెలిపారు. నోటిఫై చేసిన భూములు కాకుండా మరో 500 ఎకరాలు కోల్పోతున్నామని వాపోయారు. ఎకరాకు రూ.20 లక్షలు ఇస్తేనే.. భూసేకరణకు ఒప్పుకుంటామని స్పష్టం చేశారు. 

ఈ లోపు పూర్తి చేయాలనే..
మిలాద్​ఉన్​నబీ సందర్భంగా మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో 20వ తేదీ వరకు 144 సెక్షన్ విధించారు. నలుగురు కంటే ఎక్కువ మంది ఒకేచోట గుమిగూడొద్దని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ధర్నాకు పిలుపునిచ్చిన మేడిగడ్డ ముంపు బాధిత రైతులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. రైతులు ఆందోళనలకు పిలుపునిచ్చారనే 144 సెక్షన్ విధించారని తెలంగాణలో ప్రచారం జరిగింది.