నార్వే రచయితకు సాహిత్య నోబెల్.. 40 ఏండ్లుగా లిటరేచర్ రంగంలో జాన్ ఫోసే సేవలు

నార్వే రచయితకు  సాహిత్య నోబెల్.. 40 ఏండ్లుగా లిటరేచర్ రంగంలో జాన్ ఫోసే సేవలు
  •     నార్వేజియన్ లోని రెండు సాధారణ భాషల్లో రచనలు
  •     నాటకాలు, కథలు, నవలలు, కవిత్వం, వ్యాసాలు, అనువాద రచనలతో ప్రఖ్యాతి

స్టాక్​హోం:  సాహిత్య రంగంలో విశేష సేవలు అందించినందుకు గాను నార్వే రచయిత జాన్ ఫోసేను నోబెల్ ప్రైజ్ వరించింది. వినూత్న నాటకాలు, కథలు, గద్యాలు, నవలలు, కవితలు, అనువాదాలు, చిన్న పిల్లల సాహిత్యాలతో జాన్ ఫోసే రచనలు కొనసాగాయని స్వీడిష్ అకాడమీ ప్రశంసించింది. జాన్ తన రచనలతో నిస్సహాయుల పక్షాన నిలిచి, వారికి ఒక గొంతుకలా మారారని తెలిపింది. ఆయన రాసిన నాటకాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లోకి అనువాదం అయ్యాయని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ప్రదర్శితమైన నాటకాలు కూడా జాన్ ఫోసేవే అని కొనియాడింది. నార్వే చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆయన రచనలు ఉంటాయని మెచ్చుకుంది.  

40కి పైగా నాటకాలు

నార్వేకి సంబంధించిన రెండు అతి సాధారణ భాషల్లో జాన్ ఫోసే కవిత్వాలు, కథలు, నవలలు ఉంటాయి. ఈ భాషలను ‘న్యూ నార్వేజియన్’ ల్యాంగ్వేజెస్ అని పిలుస్తారు. దేశ జనాభాలో కేవలం 10 శాతం మంది మాత్రమే ఈ భాషల్లో మాట్లాడుతారు. జాన్ ఫోసే.. ఇప్పటి దాకా 40కి పైగా నాటకాలు రాశారు. వందల సంఖ్యలో కథలు, నవలలు, కవిత్వాలు, వ్యాసాలు, అనువాద రచనలు చేశారు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు సాహితీ రంగానికి సేవలు అందించారు. చిన్న పిల్లలకు సంబంధించిన పుస్తకాలు కూడా రాశారు. ఫోసే రచనలు 40కి పైగా భాషల్లోకి అనువాదమయ్యాయి. తన రచనల్లో ఎక్కువగా మానవ జీవన స్థితిగతులను ఫోసే ప్రస్తావిస్తుంటారు. వ్యక్తిగత జీవితాల్లో జరిగే రోజువారీ సంఘటనలను స్ఫూర్తిగా తీసుకుని నాటకాలు రాస్తుంటారు. కాగా, సాహిత్యంలో 2022 నోబెల్ ప్రైజ్ ఫ్రెంచ్ రచయిత యానీ ఎర్నాక్స్ ను వరించింది.

యాక్సిడెంట్​తో సాహిత్య రంగంవైపు

జాన్ ఫోసే (64) నార్వేలోని హౌగేసుండ్ లో 1959, సెప్టెంబర్ 29న పుట్టారు. ఏడేండ్ల వయస్సులో జరిగిన ఓ యాక్సిడెంట్ అతన్ని మృత్యువు అంచుదాకా తీసుకెళ్లింది. ఆ అనుభవమే అతన్ని సాహిత్య రంగం వైపు అడుగులు వేసేలా చేసింది. బెర్గెన్ యూనివర్సిటీలో చేరి కంపారేటివ్ లిటరేచర్ విద్యను అభ్యసించారు. తర్వాత సాహిత్య రంగాన్ని కెరీర్​గా మలుచు కున్నారు. 1983లో ఆయన ‘రెడ్‌‌, బ్లాక్‌‌’ పేరుతో తొలి నవల రాశారు. ఫిడేల్ కూడా బాగా వాయిస్తారు. డెట్ ఆండ్రీ నామ్నెట్, ది అదర్‌‌ నేమ్‌‌, ఉదా ఎర్‌‌ ఇన్‌‌ అన్నన్‌‌ వంటి వినూత్న రచనలు చేశారు. 2021లో గద్య రచనలో ‘సెప్టోలజీ’ బుక్ పూర్తి చేశారు.

పదేండ్లుగా ఎదురుచూశా

జ్యూరీ నుంచి ఫోన్ రాగానే ఒక్కసారిగా సర్ ప్రైజ్ అయ్యా. నేను పదేండ్లుగా ఈ ఫోన్ కాల్ కోసమే వెయిట్ చేశా. సాహిత్య రంగంలో నాకు ప్రతిష్టాత్మక నోబెల్ అవార్డు వచ్చిందన్న ఈ షాక్ నుంచి తేరుకోవడానికి కొంత టైమ్ పట్టింది. ఈ అవార్డును నా భాషా ఉద్యమానికి తగిన గుర్తింపుగానే భావిస్తున్నా.  

- జాన్ ఫోసే