జూరాల ప్రాజెక్టుకు పోటెత్తుతున్న వరద.. 37 గేట్లు ఎత్తివేత

జూరాల ప్రాజెక్టుకు పోటెత్తుతున్న వరద.. 37 గేట్లు ఎత్తివేత

మహబూబ్ నగర్: జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఎగువన కర్నాటక, మహారాష్ట్రల పరిధిలోని ఆల్మట్టి, నారాయణపూర్ ల నుండి వదులుతున్న వరద నీటికి తోడు… భారీ వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా నది వరద గంట గంటకు పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టుకు భారీగా వస్తున్న వరదను నియంత్రించేందుకు డ్యామ్ వద్ద మొత్తం 37 గేట్లు ఎత్తివేశారు. ఉదయం 6 గంటల సమయానికి నమోదైన లెక్కల ప్రకారం జూరాలకు ఇన్ ఫ్లో 2 లక్షల 66 వేల 621 క్యూసెక్కులు వస్తోంది. నిల్వ చేసే అవకాశం లేకపోవడంతో వస్తున్న నీటిని వస్తున్నట్లే దిగువన శ్రీశైలం డ్యాంకు విడుదల చేస్తున్నారు. మొత్తం 37 గేట్లను ఎత్తేసి 2 లక్షల 60 వేల 556 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం  9.657 టీఎంసీలు కాగా…8.631 టీఎంసీల నీటిని నిల్వ చేస్తూ వరదను కంట్రోల్ చేస్తున్నారు. మీటర్ల ప్రకారం చూసుకుంటే డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 318.010 మీటర్లు ఉంది. వరద పోటెత్తపోతుండడంతో ఎగువ , దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాలలో… విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతోంది.