హుజూర్‌నగర్‌లో జోష్​ తగ్గిన కారు!

హుజూర్‌నగర్‌లో జోష్​ తగ్గిన కారు!

భారీ వర్షంతో సీఎం సభ రద్దు
ఒక్క రోడ్డు షోతోనే సరిపెట్టిన కేటీఆర్
ప్రచారం ముగిసేవేళ కేడర్ డీలా
వెంటాడుతున్న ఆర్టీసీ సమ్మె భయం

హైదరాబాద్‌, వెలుగుహుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌కు టైం దగ్గర పడుతున్న వేళ అక్కడ టీఆర్‌ఎస్‌లో జోష్​ తగ్గింది. పార్టీ స్థానిక నాయకత్వం సీఎం కేసీఆర్​ ప్రచారంపై గంపెడాశలు పెట్టుకోగా భారీ వర్షం కారణంగా ఆయన టూర్‌ రద్దయింది. నాలుగు రోజులు హుజూర్‌నగర్‌లో పర్యటించి ప్రచారం చేస్తానని చెప్పిన పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్‌ ఒక్క రోడ్డు షోతోనే ముగించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా అధికార పార్టీ నేతలంతా నియోజకవర్గంలోనే మోహరించినా కేడర్​లో పెద్దగా ఉత్సాహం కనిపించడం లేదు. సీఎం వస్తే జోష్​ ఉండేదని, ఆయన టూర్​ రద్దు కావడంతో ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు.

కేడర్​లో అసంతృప్తి

ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన రోజే టీఆర్ఎస్​ తన అభ్యర్థిగా సైదిరెడ్డిని ప్రకటించి అన్ని పార్టీలకంటే  ముందున్నట్లు చెప్పింది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డిని కాదని, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని పార్టీ ఎన్నికల ఇన్‌చార్జీగా నియమించింది. తొలి నాళ్లలో జగదీశ్‌రెడ్డి ఇక్కడ ప్రచారానికి దూరంగా ఉంటూ వచ్చారు. పలువురు మంత్రులు, ఇతర నేతలు మాత్రమే మొదట్లో హడావుడి చేశారు. అటు తర్వాత  ప్రచారంలో జగదీశ్‌రెడ్డి రంగప్రవేశం చేశారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ ఆయన ప్రచారం చేస్తున్నా, స్థానిక కేడర్‌లో ఎక్కడో ఏదో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

పెద్ద ఎత్తున బందోబస్తు

ఇది సీఎం ఇల్లు, క్యాంప్ ఆఫీస్ ఉండే ప్రగతిభవన్. మామూలుగా చూస్తే రోడ్డు మీద గేటు ఎప్పుడూ ఉండే ఫెన్సింగే కదా అనిపిస్తుంది. కానీ కాస్త గమనిస్తే మూడునాలుగు అడుగులు ఎత్తును కొత్తగా పెంచినట్లు అర్థమవుతుంది. కొంతకాలంగా విద్యార్థులు, నిరుద్యోగులు, టీఆర్టీ అభ్యర్థులు, అంగన్ వాడీలు, పంచాయతీ కార్మికులు, ఇతర వర్గాలవారు పదేపదే నిరసనలకు వస్తుండడంతో సీఎం ఆఫీసు ముందు ఉద్రిక్తంగా మారుతోంది. దీంతో బందోబస్తును పెంచారు. గతంలో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రజా సంఘాలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చేవి. ఇలాంటి ఆందోళనలను పూర్తిగా అడ్డుకోవడంతో పాటు అసెంబ్లీ దగ్గర బందోబస్తు భారీగా పెంచారు. దీంతో ఇప్పుడు సమస్యలు ఉన్నవాళ్లు సీఎం ఆఫీస్ దగ్గరకే పోతున్నారు. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం ఆఫీస్, అసెంబ్లీ ముందు నిరసనలు జరిగినప్పుడు… సొంత రాష్ట్రం వచ్చాక ఇలాంటివి అవసరం ఉండదని ఉద్యమకారులు, పోలీసులు కూడా మాట్లాడుకునేవాళ్లు. ఇప్పుడు ఫెన్సింగ్ గతంలో కంటే మరింత ఎత్తు పెరగడం విశేషం.

తొలుత టీఆర్‌‌ఎస్‌‌కు మద్దతిచ్చిన సీపీఐ.. ఆర్టీసీ కార్మికుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ మద్దతును వాపస్​ తీసుకుంది. కార్మికులతో చర్చలు జరపకుండా మొండిగా వ్యవహరించడం టీఆర్‌‌ఎస్‌‌పై వ్యతిరేకత పెంచుతోందని స్థానిక నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకింత మొండిగా ఉందని, సకల జనులు సమ్మె చేయకుండానే తెలంగాణ వచ్చిందా అని స్థానిక ప్రజలు తమను నిలదీస్తున్నారని టీఆర్​ఎస్​ నాయకుడు ఒకరు అన్నారు. సమ్మె ప్రభావం లేదని బయటికి ఎంతగా చెప్తున్నా.. గ్రౌండ్‌‌ లెవల్​లో తాము తిరుగుతుంటే దానిపై ఉన్న వ్యతిరేకత తెలుస్తోందన్నారు. ప్రభుత్వ పథకాలు, అధికార పార్టీకి ఓటేస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అనే ప్రచారం తమను గట్టెక్కిస్తుందని మొదట స్థానిక టీఆర్‌‌ఎస్‌‌  నేతలు నమ్మారు. ఎన్నికలకు ముంగిట ఆర్టీసీ సమ్మె మొదలవడం.. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు కూడా సమ్మెకు మద్దతివ్వడం వారిని తీవ్రంగా కలవరపెడుతోంది.

సమ్మె కారణంగా భారీ బందోబస్తు

సీఎం కేసీఆర్​ మధ్యాహ్నం 2 గంటలకు సభకు వస్తారని తెలుసుకున్న టీఆర్​ఎస్​ కార్యకర్తలు, నాయకులు ఒంటి గంట వరకు అక్కడికి చేరుకున్నారు. వర్షం కారణంగా కుర్చీలు తలపై అడ్డుగా పెట్టుకుని నిలబడ్డారు. సభ రద్దయిందని తెలువడంతో వారంతా నిరుత్సాహంతో వెనుదిరిగారు. సభ కోసం స్పెషల్, రిజర్వుడ్​ పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినా లాభం లేకుండా పోయింది. ఆర్టీసీ సమ్మె జరుగుతున్న నేపథ్యంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. కార్మికులు అడ్డుకోకుండా వాళ్లు ముందస్తు చర్యలు చేపట్టారు.

వర్షం కారణంగానే: ఏవియేషన్​ డైరెక్టర్​

హుజూర్‌‌నగర్‌‌లో భారీ వర్షం కురుస్తుండటంతో సీఎం కేసీఆర్‌‌ను హెలికాప్టర్‌‌ ప్రయాణం రద్దు చేసుకోవాలని సూచించినట్లు ఏవియేషన్‌‌ డైరెక్టర్‌‌ వి.ఎన్‌‌.భరత్‌‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హుజూర్‌‌నగర్‌‌కు హెలికాప్టర్‌‌ ప్రయాణించే మార్గంలో ఉరుములు, పిడుగులతో కూడిన వాతావరణం ఉందని, భారీ వర్షం కురుస్తోందని, ఈ దశలో ప్రయాణం మంచిది కాదని సూచించినట్టు పేర్కొన్నారు. ఏవియేషన్‌‌ శాఖ హెచ్చరికలతో సీఎం తన హుజూర్‌‌నగర్‌‌ టూర్‌‌ను రద్దు చేసుకున్నట్టు సీఎంవో అధికారికంగా ప్రకటన జారీ చేసింది.

ఒక్క రోజుతో ముగించిన కేటీఆర్

ఈ నెల 4, 10, 11, 15 తేదీల్లో పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్‌‌ ప్రచార సభలు, రోడ్డు షోలు ఉంటాయని పార్టీ మొదట ప్రకటించింది. నాలుగో తేదీన హుజూర్‌‌నగర్‌‌ టౌన్‌‌లో రోడ్డు షో నిర్వహించిన కేటీఆర్‌‌ తిరిగి మళ్లీ అటువైపు చూడలేదు. ఇలా ఆయన ప్రచారం ఆగిపోవడంతో స్థానిక నేతల్లో ఆందోళన మొదలైంది. ఉప ఎన్నిక ప్రచారం శనివారం సాయంత్రం 5 గంటలతో ముగియనుండగా.. కేటీఆర్‌‌ ప్రచారానికి రాకపోవడం.. సీఎం సభ రద్దు కావడం వారిని కలవరపెడుతోంది. సీఎం సభలో పాల్గొని మాట్లాడితేనైనా కొంతలో కొంత  కలిసి వచ్చేదని, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదని టీఆర్​ఎస్​ నేతలు చర్చించుకుంటున్నారు.

సీఎం టూర్‌‌ రద్దు

సూర్యాపేట/హుజూర్‌‌నగర్, వెలుగు : సీఎం కేసీఆర్​ హుజూర్​నగర్​ ఉప ఎన్నిక ప్రచారం రద్దయింది. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సూర్యాపేటలో ఆయన బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేయగా.. వర్షం కారణంగా క్యాన్సిల్​ అయింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు వాతావరణం అనుకూలంగా ఉన్నా అటు తర్వాత భారీ వర్షం కురిసింది. ఏవియేషన్ డిపార్ట్‌‌మెంట్ వారు సీఎం కేసీఆర్​ హెలికాప్టర్ ప్రయాణానికి అనుమతి ఇవ్వకపోవడంతో సభను రద్దు చేసినట్లు మంత్రి జగదీశ్‌‌రెడ్డి, ఉప ఎన్నిక టీఆర్ఎస్ ఇన్‌‌చార్జ్‌‌ పల్లా రాజేశ్వర్ రెడ్డి  సభా ముఖంగా ప్రకటించారు.