కార్మిక చట్టాలను రద్దుచేసి కేంద్రం నాలుగు లేబర్ కోడ్ లను తీసుకురావడంపై జర్నలిస్టు సంఘాలు భగ్గుమన్నాయి. కార్మిక చట్టాల రద్దుకు వ్యతిరేకంగా సోమవారం (నవంబర్ 24) హైదరాబాద్ లోని కేంద్ర కార్మిక శాఖ కార్యాలయం ముందు జర్నలిస్టు సంఘాలు ధర్నాకు దిగాయి. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (HUJ) ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో భారీ ఎత్తున జర్నలిస్టులు పాల్గొన్నారు.
కార్మిక చట్టాలను రద్దుచేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను ఉపసంహరించుకునేంత వరకు కార్మికులు, జర్నలిస్టులు పోరాటం చేయాలని జర్నలిస్టు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దాదాపు రెండు గంటలపాటు ధర్నా నిర్వహించారు.
ధర్నాకు అధ్యక్షత వహించిన ఫెడరేషన్ అడ్ హక్ కమిటీ కన్వీనర్ పి. రాంచందర్ మాట్లాడుతూ కార్మికులను గాలికొదిలేసి కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్రం వ్యవరిస్తుందని అన్నారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బి. బసవపున్నయ్య మాట్లాడుతూ.. కొత్త లేబర్ కోడ్లతో జర్నలిస్టుల సమస్యలు మరింత జఠిలమవుతాయని అన్నారు. కొత్త కోడ్ ల కారణంగా ఇప్పుడున్న 8 పనిగంటల పనివిధానం పోయి 12 నుంచి 16 గంటల వరకు పెరుగుతుందని కార్మిక సంఘం నేత జె వెంకటేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం సెంట్రల్ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ బిశ్వ భూషణ్ పృష్టికి ఫెడరేషన్ నాయకులు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై. ప్రభాకర్, గుడిగ రఘు, బి. రాజశేఖర్, జి. మాణిక్ ప్రభు, కార్యదర్శులు ఈ చంద్రశేఖర్, గండ్ర నవీన్, దామోదర్, కార్యవర్గ సభ్యులు మణిమాల, హరిప్రసాద్, మేకల కృష్ణ, మధుకర్, రమేష్, సైదులు, హెచ్ యూజే అధ్యక్షులు బి అరుణ్ కుమార్, కార్యదర్శి బి. జగదీశ్వర్, హెచ్ యూజే నాయకులు లలిత, రమాదేవి, రత్నాకర్, తలారీ శ్రీనివాసరావు, జీవన్ రెడ్డి, రమేష్, కాలేబు, సర్వేశ్వర్ రావు, బ్రహ్మం, రాము, రవి తదితరులు పాల్గొన్నారు.
