జర్నలిస్ట్ లకు మరింత స్వేచ్ఛ ఉండాలె : కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి

జర్నలిస్ట్ లకు మరింత స్వేచ్ఛ ఉండాలె : కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి
  •     ‘ఢిల్లీ టీయూడబ్ల్యూజే హెచ్ 143’  డైరీ రిలీజ్

న్యూఢిల్లీ, వెలుగు: జర్నలిస్టులకు మరింత స్వేచ్ఛ ఉండాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. జర్నలిస్ట్ ల స్వేచ్ఛ అంటే, యాజమాన్యాల స్వేచ్ఛ కాదని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్ గురజాడ హాల్​లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్–హెచ్ 143(టీయూడబ్ల్యూజే) డైరీ–2023 రిలీజ్ చేశారు. ఢిల్లీ మీడియా రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వాయిస్ ​వినిపిస్తున్నదని కిషన్ రెడ్డి  కొనియాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీడియాపై ఉందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అభిప్రాయపడ్డారు.  

తెలంగాణ ఏర్పాటులో జర్నలిస్ట్ ల పాత్ర మరువలేనిదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు.  కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎంపీ బీద మస్తాన్ రావు, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు  నాగిళ్ల వెంకటేశ్, జనరల్ సెక్రటరీ వంగ తిరుపతి, కొండపల్లి శిరీశ్​ రెడ్డి, సోమన్నగారి రాజశేఖర్ రెడ్డి, ఉంద్యాల అశోక్ రెడ్డి, కృష్ణారావు, విజయ్ కుమార్, రవీందర్ రెడ్డి, కొన్నోజు రాజు, మేక గోపి కృష్ణ, జబ్బర్ లాల్ నాయక్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

డెమోక్రసీ కాదు.. కాంగ్రెస్ ప్రమాదంలో ఉంది

దేశంలో ప్రమాదంలో ఉన్నది ప్రజాస్వామ్యం కాదని, కాంగ్రెస్ పార్టీయేనని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి కామెంట్​ చేశారు. ఈ వ్యవహారంలో రాహుల్ గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్న పార్టీలు చేస్తున్న రాద్ధాంతం అర్థరహితమన్నారు. మంగళవారం పార్లమెంటు ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కోర్టు తీర్పు కారణంగా రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయాడు. కాంగ్రెస్ పార్టీ, దానికి మద్దతుగా నిలుస్తున్న ఇతర పార్టీలు కోర్టు తీర్పులను కూడా తప్పుబడుతుండటం హాస్యాస్పదం’ అని అన్నారు.