కేంద్రంలో మళ్లీ బీజేపీనే.. రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తం: నడ్డా

కేంద్రంలో మళ్లీ బీజేపీనే.. రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తం: నడ్డా
  • 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులతో హైదరాబాద్​లోని పార్టీ ఆఫీసులో భేటీ
  • లోక్​సభ ఎన్నికల్లో దక్షిణాదిన సత్తా చాటాలని దిశానిర్దేశం

హైదరాబాద్, వెలుగు: వచ్చే లోక్​సభ ఎన్నికల్లో దక్షిణాదిన సత్తా చాటాలని బీజేపీ నేతలకు పార్టీ నేషనల్​ చీఫ్​ జేపీ నడ్డా దిశా నిర్దేశం చేశారు. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని, తెలంగాణలోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాదిన బలంగా ఉన్న పార్టీ.. దక్షిణాదిన ఎందుకు బలపడడం లేదనే దానిపై ఆయా రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులు దృష్టి పెట్టాలని సూచించారు. ఆదివారం హైదరాబాద్​లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో రీజినల్ కన్సల్టేషన్ మీటింగ్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలతో పాటు వాటికి పొరుగున్న మరికొన్ని రాష్ట్రాల పార్టీ చీఫ్​లు, సంస్థాగత ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. 

మొత్తం 11 రాష్ట్రాలకు చెందిన బీజేపీ అధ్యక్షులు ఇందులో పాల్గొన్నారు. సమావేశానికి జేపీ నడ్డా, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్​చార్జ్​ ప్రకాశ్ జవదేకర్, పార్టీ  జాయింట్ జనరల్ సెక్రటరీ శివ ప్రకాశ్, పార్టీ ఇన్​చార్జులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ హాజరయ్యారు. దక్షిణాదిన పార్టీ బలోపేతంపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నడ్డా మాట్లాడుతూ..  వచ్చే లోక్​సభ ఎన్నికల్లో దక్షిణాదిన సాధ్యమైనంత ఎక్కువ సీట్లు గెలువాలని సూచించారు. ఎన్నికలకు ఎక్కువ సమయం లేదని, వెంటనే వ్యూహాలను రూపొందించుకొని ముందుకు వెళ్లాలని చెప్పారు. ఈసారి కూడా కేంద్రంలో అధికారం తమదేనని, మూడోసారి ప్రధానిగా మోదీ ఎన్నికవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలో మోదీ నాయకత్వాన్ని  ప్రజలు బలంగా కోరుకుంటున్నారని, బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమనే నమ్మకం ప్రజల్లో ఉందని తెలిపారు. 

రిపోర్టులు సమర్పించిన రాష్ట్రాల అధ్యక్షులు 

తమ రాష్ట్రాల్లో బీజేపీ చేపట్టిన కార్యక్రమాల నివేదికలను  11 రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు నడ్డాకు సమర్పించారు. వాటిని పరిశీలించిన ఆయన...చాలా రాష్ట్రాల అధ్యక్షుల పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పనితీరును మార్చుకోవాలని, జనం తరఫున ఉద్యమించేందుకు వెంటనే రూట్ మ్యాప్ ను రెడీ చేసుకోవాలన్నారు. తమిళనాడు పార్టీ అధ్యక్షుడు అన్నామలై పనితీరును నడ్డా సమావేశంలో ప్రశంసించారు. పార్టీ పటిష్టత కోసం బాగా కష్టపడుతున్నారని ఆయన అభినందించారు. కాగా, పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ మాట్లాడుతూ... బూత్ స్థాయిలో పార్టీ బలోపేతంగా ఉంటేనే ఏ ఎన్నికల్లోనైనా విజయం సాధ్యమవుతుందని సూచించారు. ఆయా రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శుల ద్వారా అక్కడ పార్టీ పరిస్థితులను ఆయన  అడిగి తెలుసుకున్నారు.  ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం ఏడు గంటల  వరకు సాగింది. 

మీ పోరాటాలకు అండగా ఉంటం

బీఆర్​ఎస్​ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు జనంలోకి తీసుకెళ్లాలని, దీనికోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకోవాలని రాష్ట్ర నేతలకు నడ్డా సూచించారు. ఇదే సమయంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం కూడా మరో  కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై జనంతో కలిసి ఆందోళనలు, నిరసనలు కొనసాగించాలని చెప్పారు.  ‘‘మీరు చేసే పోరాటాలకు బీజేపీ జాతీయ నాయకత్వం అండగా ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా బీజేపీ సర్కార్ ఏర్పడడం ఖాయం. బీఆర్ఎస్ ను ఓడించే శక్తి కేవలం బీజేపీకే ఉందన్న విషయాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లాలి. మనకు కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ప్రధాన ప్రత్యర్థులే. ఇద్దరికీ సమదూరం పాటిస్తున్నం. ఎవరితోనూ మనకు ఎలాంటి ఒప్పందాలు, దోస్తానా లేదు” అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి నుంచే రాష్ట్ర నేతలు మంచి సమన్వయంతో పనిచేస్తే తెలంగాణలో అనుకున్న ఫలితాలు సాధించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. తొమ్మిదేండ్లుగా  కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లాలని, కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. పేద, మధ్య తరగతి వర్గాల సంక్షేమమే మోదీ సర్కార్ లక్ష్యమని, ఆ వర్గాల జనంతో ఎప్పటికప్పుడు మమేకం కావాలని పార్టీ నేతలకు ఆయన పిలుపునిచ్చారు.

 రాష్ట్రంలో పార్టీ  పరిస్థితిపై నేతల వివరణ

తెలంగాణలో బీజేపీ పరిస్థితిపై ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, పార్టీ జాతీయ ఉపాధ్య క్షురాలు డీకే అరుణ, తమిళనాడు కో ఇన్​చార్జ్​ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లా డారు. బీజేపీ, బీఆర్​ఎస్​ ఒక్కటే అన్నట్లు గా కాంగ్రెస్​ దుష్ప్రచారం చేస్తున్నదని, దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ఒకరిద్దరు నేతలు అన్నారు. అవినీతికి పాల్పడ్డ వారిని చట్టపరంగా శిక్షించడంలో జరుగుతున్న జాప్యాన్ని ఇందుకు ఉదాహరణగా కాంగ్రెస్​ చూపుతున్నదని తెలిపారు.