కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి.. కేసీఆర్​ను జైలుకు పంపుతం: నడ్డా

కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి.. కేసీఆర్​ను జైలుకు పంపుతం: నడ్డా

తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు పంపిస్తుంటే, కమీషన్ల కోసం ఆ నిధులను బీఆర్ఎస్ సర్కార్ దారి మళ్లిస్తున్నదని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆరోపించారు. కేసీఆర్​ది 30% కమీషన్ సర్కార్ అని విమర్శించారు. కమీషన్ల సర్కార్ ను ఇంటికి పంపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం నారాయణపేట జిల్లా కేంద్రంలో, రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన బీజేపీ సభల్లో, హైదరాబాద్​లోని మల్కాజిగిరిలో నిర్వహించిన రోడ్ షోలో నడ్డా పాల్గొని మాట్లాడారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగింది. 

ఈ మధ్యే మేడిగడ్డ బ్యారేజీ కుంగి ఆ అవినీతి బట్టబయలైంది. తెలంగాణలో మా ప్రభుత్వం రాబోతున్నది. మేం అధికారంలోకి రాగానే కాళేశ్వరంపై విచారణ జరిపి, కేసీఆర్​ను జైలుకు పంపిస్తాం” అని చెప్పారు. ‘‘కేసీఆర్ సర్కార్ ధరణి పేరుతో భూములు దోచుకున్నది. ధరణి పోర్టల్ ను హరిణి పోర్టల్ గా మార్చుకుంది. మియాపూర్​లో 693 ఎకరాలకు సంబంధించి రూ.4 వేల కోట్ల భూ కుంభకోణం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డులో రూ.వెయ్యి కోట్ల భూ కుంభకోణం జరిగింది. 

చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామంలో ఉన్న1,100 ఎకరాల సీతారాముల గుడి మాన్యాలను టీఎస్​ఐఐసీ ద్వారా తీసుకుని   రూ.కోట్లకు కేటీఆర్ అమ్ముకున్నారు. అలాగే 1,300 ఎకరాల అసైన్డ్ భూములను పేదల నుంచి బీఆర్ఎస్​ ప్రభుత్వం లాక్కున్నది” అని ఆరోపించారు. దళితబంధులో బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు 30 శాతం కమీషన్లు తీసుకున్నారని, ఈ విషయం సీఎం కేసీఆరే స్వయంగా ఒప్పకున్నారని పేర్కొన్నారు. ఈ 30% కమీషన్ సర్కార్​కు ఈసారి ఎన్నికల్లో ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

కేసీఆర్​ది కుటుంబ పాలన.. 

బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ ​రాక్షస సమితి అని నడ్డా విమర్శించారు. కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ‘‘కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకం.  జమ్మూకాశ్మీర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ​ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మేం పోరాడుతున్నాం. యువత బలిదానాలతో ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే.. కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి, తన కుటుంబ అభివృద్ధి కోసం పని చేస్తున్నారు. 

ఇవి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఎన్నికలు. కుటుంబ పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి” అని పిలుపునిచ్చారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలు కుటుంబ ప్రయోజనాల కోసం పాలిస్తుండగా, బీజేపీ మాత్రం దేశం కోసం పాలన సాగిస్తోందని అన్నారు. రాష్ట్రంలో అవినీతి, కుటుంబ పాలన పోవాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. 

తెలంగాణలో అన్ని రేట్లు ఎక్కువే.. 

బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అన్ని రేట్లు ఎక్కువేనని నడ్డా విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్​పై వ్యాట్ తగ్గించగా.. కేసీఆర్ మాత్రం తగ్గించలేదని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ‘‘ఓట్ల కోసం మైనార్టీలను కేసీఆర్ మభ్యపెడుతున్నారు. 4 శాతం ఉన్న మైనార్టీ రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

 ఉర్దూను ద్వితీయ భాషగా ప్రకటించారు. కేసీఆర్ కేవలం మైనార్టీల అభివృద్ధి కోసమే పాటుపడుతూ.. దేవాలయాల భూములను అన్యాక్రాంతం చేసి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు” అని నడ్డా ఆరోపించారు. ప్రధాని మోదీ తెచ్చిన ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయకుండా రైతులను, ఆయుష్మాన్ భారత్ అమలు చేయకుండా పేదలను కేసీఆర్​మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే ఫసల్ బీమా, ఆయుష్మాన్ భారత్ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 

కాంగ్రెస్ వస్తే అవినీతే.. 

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్రం నుంచి వచ్చిన నిధులను కేసీఆర్ దారిమళ్లించారని నడ్డా ఆరోపించారు. కేంద్రం 4 కోట్ల ఇండ్లు ఇచ్చిందని, కానీ చేవెళ్లలో ఒక్కరికి కూడా కేసీఆర్ డబుల్​బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్రంలోనూ బీజేపీ వస్తే అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వస్తాయని చెప్పారు. ఎన్నో హామీలిచ్చి కర్నాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అక్కడ ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. 

‘‘కర్నాటకలో ఐదు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చలేదు. ఇంతకుముందు 24 గంటల విద్యుత్​ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు కనీసం 4 గంటలు కూడా ఇవ్వడం లేదు” అని అన్నారు. కాంగ్రెస్ గ్యారంటీల సంగతేమో గానీ.. ఆ పార్టీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ లాగే అవినీతి, కుటుంబ పాలన గ్యారంటీ అని విమర్శించారు.