
- బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావుతో జేపీ నడ్డా
- విభేదాలు పక్కనపెట్టి కలిసి పని చేయాలని సూచన
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ పంచాయితీపై ఢిల్లీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కారణంగా రాష్ట్రంలో పార్టీకి జరుగుతున్న నష్టంపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. నేతల మధ్య వివాదాలతో రాష్ట్రంలో పార్టీ బలహీనపడుతున్నదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇక నుంచి ఎవరూ పార్టీ లైన్ దాటొద్దని, బహిరంగ విమర్శలు చేయొద్దని హైకమాండ్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. పార్టీ నిబంధనలు ఎవరు అతిక్రమించినా ఉపేక్షించేది లేదని, పార్టీ నేతలకు హెచ్చరికలు పంపాలని రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు హైకమాండ్ స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా రాంచందర్ రావు మంగళవారం పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్‌ను కలిశారు. ఈ సందర్భంగా బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య నెలకొన్న విభేదాలపై చర్చించినట్లు తెలిసింది. అలాగే.. కిషన్ రెడ్డి, రాజాసింగ్ వ్యవహారంపైనా హైకమాండ్ ఆరా తీసినట్లు సమాచారం.
పార్టీ బలోపేతంపై చర్చించాం: రాంచందర్ రావు
రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై హైకమాండ్ తో చర్చించినట్లు బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ముఖ్య నేతలు సంతోష్, శివప్రకాశ్, సునీల్ బన్సల్, అర్వింద్ మీనన్ తో భేటీ అయినట్లు తెలిపారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు హైకమాండ్ పలు సూచనలు చేసిందని తెలిపారు. కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ని కలిసి రాష్ట్రాభివృద్ధి, కేంద్ర పథకాల అమలు వంటి అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు.