టార్గెట్లు చేరుకుంటేనే  జేపీఎస్​ల రెగ్యులరైజ్​.. సీఎం కేసీఆర్

టార్గెట్లు చేరుకుంటేనే  జేపీఎస్​ల రెగ్యులరైజ్​.. సీఎం కేసీఆర్

 

  • టార్గెట్లలో మూడింట రెండొంతు లు పూర్తి చేసిన జూనియర్ పంచాయతీ సెక్రటరీలనే రెగ్యుల
  • రైజ్ చేయాలని సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. 

హైదరాబాద్, వెలుగు: పెట్టిన టార్గెట్లలో మూడింట రెండు వంతులు పూర్తి చేసిన జూనియర్ పంచాయతీ సెక్రటరీ(జేపీఎస్)లనే రెగ్యులరైజ్ చేయాలని సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన చర్యలు ప్రారంభించాలని సీఎస్ శాంతికుమారిని, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావులను సీఎం ఆదేశించారు. ప్రొబేషన్ పీరియడ్ ను పూర్తి చేసుకున్న జేపీఎస్​లను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలిస్తుందన్నారు. కమిటీ పరిశీలన ప్రకారం రెగ్యులరైజేషన్ ఉంటుందన్నారు.

మంగళవారం సెక్రటేరియేట్​లో సీఎం కేసీఆర్​ ఆధ్వర్యంలో జేపీఎస్​ల రెగ్యులరైజేషన్, ఇతర శాఖల్లో వీఆర్​ఏల సర్దుబాటు ప్రక్రియపై ఉన్నతస్థాయి సమావేశం జరిగిందని సీఎం కేసీఆర్ తెలిపారు. నాలుగేండ్ల శిక్షణా కాలాన్ని పూర్తి చేసుకున్న పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలను, రూల్స్ మేరకు వారి పనితీరును పరిశీలించి, రెగ్యులరైజ్​ చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రతను కాపాడేందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించడం, మొక్కలు నాటించడం, వాటిని కాపాడే దిశగా పర్యవేక్షించడంతో పాటు పలు రకాల  బాధ్యతలను చేపట్టాలనే రూల్స్​ను రాష్ట్ర ప్రభుత్వం వారికి డ్యూటీగా నిర్ణయించింది.

వారంలో వీఆర్​ఏల సర్దుబాటు

వీఆర్ఏ లతో సమావేశమై, చర్చించి వారి అభిప్రాయాలను సేకరించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. మొత్తం ప్రక్రియ వారం లోపు పూర్తి కావాలని సీఎం ఆదేశించారు. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో మంత్రులు జి.జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ తో కూడిన మంత్రి వర్గ ఉప సంఘాన్ని  ఏర్పాటు చేశారు.ఈ మంత్రివర్గ ఉపసంఘం వీఆర్ఏ లతో బుధవారం నుంచి చర్చలు ప్రారంభించనున్నది. చర్చల అనంతరం ఉప సంఘం సూచనల ప్రకారం నిర్ణయాలు తీసుకోని వీఆర్ఎల సేవలను వినియోగించుకునే దిశగా చర్యలు చేపట్టాలని సీఎస్​ శాంతికుమారిని సీఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఉప సంఘం కసరత్తు పూర్తయి తుది నివేదిక సిద్దమైన తర్వాత మరోమారు చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సిఎం కేసీఆర్ తెలిపారు. మరోవైపు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో మెడికల్ కాలేజీ మంజూరు చేసినందుకు, ఆ మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావులు సీఎం కేసీఆర్ ను మంగళవారం సచివాలయంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు.

ఆగస్టు 25న సెక్రటేరియెట్​లో నల్లపోచమ్మ గుడి ప్రారంభం

కొత్త సెక్రటేరియెట్​లో నిర్మాణం పూర్తయిన నల్లపోచమ్మ ఆలయం, మసీదు, చర్చ్ ను ఒకే రోజు ప్రారంభించాలని సీఎం కేసీఆర్​ నిర్ణయించారు. అందుకు ఆగస్టు 25ను ముహూర్తంగా నిర్ణయించారు. ఈ మేరకు మంత్రులు, సీఎస్​, సీఎంవో , ఆర్ అండ్ బీ అధికారులతో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష  నిర్వహించారు. ఆయా మతాల పెద్దలను సంప్రదించి నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ‘చీఫ్ మినిస్టర్స్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీం’ ద్వారా లబ్ధి పొంది వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన ఎస్టీ యువతపై రూపొందించిన పుస్తకాన్ని సీఎం కేసీఆర్​ మంగళవారం  సచివాలయంలో ఆవిష్కరించారు.