హైదరాబాద్ సిటీ, వెలుగు: పోలింగ్కేంద్రాలకు వచ్చి ఓట్లు వేయడానికి ఇబ్బంది పడే వారిలో వృద్ధులు, దివ్యాంగులు ఎక్కువగా ఉంటారు. అయితే, ఈసారి వీరిని భాగస్వామ్యం చేయడానికి ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
దీంతో వయోవృద్ధులు, దివ్యాంగ ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎండను తట్టుకోవడానికి టెంట్లు, కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేశారు. ఇలా మినిమం ఫెసిలిటీస్ తో పాటు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ర్యాంప్స్ ఏర్పాటు చేశారు.
వారికి సహాయం చేయడానికి వలంటీర్లను నియమించారు. దివ్యాంగ ఓటర్లు ఎలాంటి ఆటంకం లేకుండా ఓటు వేసేందుకు వీలుగా ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వీల్చైర్లను అందుబాటులో ఉంచారు. క్యూ లైన్‌లో వేచి ఉండకుండా వీరికి ముందు ప్రాధాన్యత ఇచ్చి ఓటు వేయించారు. అవసరమైన వారికి ఇంటి నుంచి వచ్చేందుకు, తిరిగి వెళ్లేందుకు వాహనాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో దాదాపు 8 వేల వరకు ఓటర్లు వృద్ధులు, దివ్యాంగులు ఉన్నారు.
