జూబ్లీహిల్స్, వెలుగు: పొరపాటున ఓ మహిళ నుంచి మిస్డ్ కాల్ వెళ్లడాన్ని ఆసరాగా చేసుకుని, ఆమెకు అసభ్యకర సందేశాలు పంపుతూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణానగర్ ప్రాంతానికి చెందిన మహిళా టైలర్ (38) ఈ నెల 19న తన స్నేహితురాలికి ఫోన్ చేయబోయి పొరపాటున విఘ్నేష్ అనే వ్యక్తికి కాల్ చేశారు.
దాంతో అతను తనను తాను ‘డాక్టర్’గా పరిచయం చేసుకుని, ఫోన్ కాల్స్, వాట్సాప్ ద్వారా మాట్లాడటం మొదలుపెట్టాడు. కొద్దిరోజులకే రూటు మార్చి అసభ్యకరమైన వ్యాఖ్యలు, లైంగిక ఉద్దేశాలతో కూడిన మెసేజ్లతో వేధించడం ప్రారంభించాడు. బాధితురాలు గట్టిగా మందలించినప్పటికీ వేధింపులు ఆపకపోవడంతో బుధవారం జాబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
