
- యూసఫ్‌గూడ నుంచి భారీ ర్యాలీ.. తరలి వచ్చిన కార్యకర్తలు
- గత పదేండ్లలో రాష్ట్రం ఆగమైంది: అసదుద్దీన్ ఒవైసీ
- కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు విషెస్, మద్దతు
- గెలిచి అన్ని వర్గాలను కలుపుకొని పోవాలని సూచన
హైదరాబాద్ సిటీ, వెలుగు: గత పదేండ్లలో రాష్ట్రం ఆగమైందని, బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి జరగలేదని ఎంఐఎం చీఫ్. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవాలని ఆకాంక్షించారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ శుక్ర వారం నామినేషన్ వేశారు. అదే టైమ్ లో షేక్ పేటలోని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం సమీపం లోని మసీదుకు వచ్చిన అసదుద్దీన్ ఒవైసీని ఆయన కలిశారు. ఈ సందర్భంగా నవీన్ యాదవ్ ను ఆసద్ ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు.
'నువ్వు గెలవాలి.. అన్ని వర్గాలను కలుపుకొనిపోవాలి' అని సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్ని కలో నవీన్ యాదవ్ కు ఎంఐఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందని అసద్ ప్రకటించారు. "అభివృద్దే మా లక్ష్యం. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి జరగలేదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని మురికివాడల్లో సమస్యలు పరిష్కారం కాలేదు.
సెంటిమెంట్ కంటే అభివృద్ధి ముఖ్యం. అసెంబ్లీ ఎన్నికల్లో 37 శాతం ఓట్లు సాధించిన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి 15 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి మళ్లినట్టుగా స్పష్టమవుతున్నది. అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కుమద్దతు ఇవ్వాలని నిర్ణయించాం" అని వెల్లడించారు. అయితే తాను మాత్రం ప్రచారంలో పాల్గొనబోనని స్పష్టం చేశారు.
భారీ ర్యాలీతో నవీన్ నామినేషన్..
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. మంత్రులు వివేక్ వెంకట స్వామి, పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయ లక్ష్మితో కలిసి ఒక సెట్ .. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, రహమత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డితో కలిసి మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు యూసుఫ్ గూడ చౌరస్తా నుంచి భారీ ర్యాలీతో వచ్చారు.
ఇందులో మంత్రి వివేక్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పాల్గొన్నారు. యూసుఫ్‌గూడ బస్తీ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. జానకమ్మతోట, కృష్ణానగర్, ఇందిరానగర్, కమలాపురి కాలనీ మీదుగా సాగింది. అయితే నామినేషన్ వేసేందుకు ముహూర్తం దగ్గర పడడంతో ర్యాలీ మధ్యలోనుంచే నవీన్ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యా హ్నం 2:20 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. ర్యాలీకి భారీగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
గెలుపు నాదే: నవీన్ యాదవ్
ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం ఉన్నదని నవీన్ యాదవ్ అన్నారు. నామినేషన్ వేసిన అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు."నాకు టికెట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పెద్దలకు ధన్యవాదాలు. కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న అభివృద్ధితో జూబ్లీహిల్స్ లో గెలుస్తానన్న ధీమా ఉంది. ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించబోతున్నారు. నాయకులు, కార్తకర్తలు, ప్రజల కోరిక మేరకు పార్టీ హైకమాండ్ నాకు అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వంపై ఒక నమ్మకం ఏర్పడింది. జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ నే సాధ్యం" అనినవీన్ యాదవ్ అన్నారు.
కేటీఆర్.. పదేండ్లలో చేసిందేంటి?: పొన్నం
పదేండ్ల పాలనలో జూబ్లీహిల్స్ లో ఏం అభివృద్ధి చేశారో కేటీఆర్ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాక ర్ డిమాండ్ చేశారు. నవీన్ యాదవ్ నామినేషన్ అనంతనం మీడియా పాయింట్ వద్ద ఆయన మా ట్లాడారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ తో నే సాధ్య మన్నారు. నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు.
బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంతో ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. "రెండేండ్లలోనే రోడ్లు, డ్రైనేజీలు సహా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా చేశాం. అర్హులందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేయడంతో పాటు సన్న బియ్యం పంపిణీ ఇస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ అందిస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. కోటి మంది మహి ళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా వడ్డీలేని రుణాలు ఇస్తున్నాం" అనిచెప్పారు.