హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్లో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుందన్న అభిప్రాయాన్ని తొలగించేందుకు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చక్కని అవకాశమని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ ఛైర్మన్ డా. బొమ్మర బోయిన కేశవులు ముదిరాజ్ అన్నారు. నవంబరు 11న జరగబోయే ఉపఎన్నికల్లో వంద శాతం ఓటింగ్ నమోదు చేయాలని పిలుపునిచ్చారు.
బుధవారం జూబ్లీహిల్స్నియోజకవర్గంలోని ఓజోన్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ సంస్థల ఆధ్వర్యంలో ఓటరు అవగాహన ర్యాలీ, సమావేశం నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, యువత, మహిళలు, వ్యాపారస్థులు, కూలీలు సహా అన్ని వర్గాలు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులు నచ్చకపోతే నోటాకు ఓటు వేయాలని, ఎట్టి పరిస్థితుల్లో ఓటు విడిచిపెట్టొద్దని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అందరినీ ఓటు వినియోగానికి ప్రతిజ్ఞ చేయించారు.
