
కరకట్టపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఉంటున్న అక్రమ నివాసాన్ని జప్తు చేసేందుకు అనుమతివ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ ను ఏసీబీ కోర్టు నేడు ( మే 31) విచారించి తీర్పును రిజర్వ్ చేశారు. ఈ రోజు ( మే 31) సాయంత్రం తీర్పు వెలువడే అవకాశం ఉంది. విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. లింగమనేని గెస్ట్ హౌస్ ను చంద్రబాబు అక్రమంగా పొందారని సీఐడీ ఆరోపణలు చేసింది.
రాజధాని భూసేకరణ నుంచి మినహాయించినందుకు ప్రతిఫలంగా చంద్రబాబు గెస్ట్ హౌస్ పొందారని ఆయన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు ఉంటున్న ఆ నివాసం.. లింగమనేని రమేష్ పేరిట(గెస్ట్‌హౌజ్‌గా) ఉంది. అయితే.. దానిని చంద్రబాబు అక్రమంగా పొందారని, దానిని జప్తు చేసేందుకు అనుమతి ఉత్తర్వులు ఇవ్వాలంటూ నాలుగురోజుల క్రితం దరఖాస్తు చేసుకుంది సీఐడీ. ఒక వేళ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు చెందిన నివాసం జప్తునకు కోర్టు అనుమతి ఇస్తే.. ఏపీ సీఐడీ అధికారులు రంగంలోకి దిగి.. అన్నంత పని చేసేస్తారు.