
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాన్-2 ప్రయోగం టెక్నాలజీ లోపంతో అర్థంతరంగా నిలిచిపోయింది. ఈ నెల 15 తెల్లవారు జామున శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో జరగాల్సిన ప్రయోగం వాయిదా పడింది. చంద్రయాన్2 స్పేస్ క్రాఫ్ట్ క్రయోజనిక్ దశలో లీకేజి ఉన్నట్టు తెలుసుకున్నారు. దీన్ని సరిచేసేందుకు ఇస్రో ఇంజినీర్ల టీం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈసారి ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అన్నీ అనుకూలిస్తే ఈ నెల 21 గానీ, 22వ తేదీ గానీ చంద్రయాన్-2 ప్రయోగం నిర్వహించాలని ఇస్రో వర్గాలు భావిస్తున్నాయి. మొదట రీలాంచ్ కు అనువైన సమయంగా జూలై 22వ తేదీగా నిర్ణయించినా… అంతకుముందు రోజు కూడా ప్రయోగానికి అనుకూలంగానే ఉండడంతో ఈ రెండు తేదీల్లో ఏదో ఒక రోజు ప్రయోగం నిర్వహించేందుకు ఇస్రో ఇంజినీర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.