భారత క్రికెట్ చరిత్రలో మైలురాయి

భారత క్రికెట్ చరిత్రలో మైలురాయి

1983 వరల్డ్ కప్..భారత క్రికెట్ చరిత్రలో ఇదో సువర్ణధ్యాయం. పసికూనగా దిగి.. పడిలేచిన కెరటంలా  పటిష్ట జట్లపై టీమిండియా విజయవిహారం చేసింది. జూన్ 25 1983లో  కపిల్ దేవ్ సారథ్యంలో మొట్టమొదటి సారిగా  విశ్వవిజేతగా నిలిచింది.  భారత జట్టు సమిష్టిపోరాటంతో సగర్వంగా వరల్డ్ కప్ను ముద్దాడి నేటికి 39 ఏళ్లు.  ఈ సందర్భంగా నాటి మధుర స్మృతులను మరోసారి గుర్తు చేసుకుందాం..

జెంటిల్మెన్ గేమ్ క్రికెట్.  ఆ క్రికెట్కు పుట్టిళ్లు లార్డ్స్.  అలాంటి లార్డ్స్లో వరల్డ్ కప్  సాధించాలి..వరల్డ్ కప్ను గర్వంతో ముద్దాడాలనేది ప్రతీ కెప్టెన్ కల. ఆ కలను దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ నేరవేర్చుకున్నాడు. లార్ట్స్లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమిండియాను విజేతగా నిలిపాడు. 1975,1979లలో రెండు సార్లు వరల్డ్కప్ను ఎగరేసుకుపోయిన క్లైవ్ లాయిడ్ కెప్టెన్సీలోని వెస్టిండీస్ పై భారత్ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలిసారి ప్రపంచకప్ను దక్కించుకుంది.

అండర్ డాగ్గా..
1983 వరల్డ్ కప్లో భారత్ అండర్ డాగ్గా బరిలోకి దిగింది. గ్రూప్ B లో మొత్తం ఆరు మ్యాచులాడిన టీమిండియా..4 విజయాలు, 2 ఓటములతో 16 పాయింట్లు సాధించి రెండో ప్లేస్లో నిలిచింది. దీంతో వెస్టిండీస్తో కలిసి భారత్ సెమీస్లో అడుగుపెట్టింది. ఇక సెమీస్లో కపిల్ సేన..పటిష్ట ఇంగ్లాండ్ తో డు ఆర్ డై మ్యాచ్ ఆడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ టీమ్..213 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత భారత్..54.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. సెమీస్లో యశపాల్ శర్మ, సందీప్ పాటిల్ హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో మొదటి సారిగా వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. అటు డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ ..పాక్పై గెలిచి వరుసగా మూడో సారి ఫైనల్కు చేరుకుంది. 

బ్యాటింగ్లో విఫలమై...
డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన వెస్టిండిస్‌ మరోసారి ఫైనల్ చేరడంతో..విండీస్ టీమ్ హ్యాట్రిక్ వరల్డ్ కప్ లు సాధిస్తుందని అంతా అనుకున్నారు. అనుకున్నట్లే మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియాను వెస్టిండీస్..54.4 ఓవర్లలో 183 పరుగులు చేసి ఆలౌట్ చేసింది. 
భారత బ్యాట్స్‌మెన్‌లలో ఓపెనర్ సునీల్‌ గావస్కర్‌ కేవలం 2 పరుగులే చేసిన  నిరాశపరిచాడు. మరో ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్‌ 38 పరుగులతో పర్వాలేదనిపించాడు.  అమర్‌నాథ్‌ 26 ,  సందీప్‌ పాటిల్‌ 27 పరుగులతో రాణించారు. అయితే కెప్టెన్  కపిల్‌ దేవ్‌, మదన్‌లాల్‌, కిర్మాణి, బల్విందర్‌ సంధు, యాష్పల్‌ శర్మ లు విఫలమవడంతో టీమిండియా తక్కువ స్కోరు మాత్రమే చేయగలిగింది. 

బౌలింగ్లో మ్యాజిక్ చేసిన టీమిండియా..
అటు చూస్తే భీకర ఫాంలో ఉన్న విండీస్ టీమ్..ఇటు చూస్తే పసికూన ఇండియా..ఈ నేపథ్యంలో వెస్టిండీస్ గెలుపు ఈజీ అనుకున్నారు. కానీ..బౌలింగ్లో టీమిండియా మ్యాజిక్ చేసింది. బుల్లెట్ లాంటి బంతులతో రెచ్చిపోయిన టీమిండియా..విండీస్ను  52 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూల్చింది.  మొహిందర్‌ అమర్‌నాథ్‌, మదన్‌లాల్‌లు తలో మూడు వికెట్లు తీయగా... సంధు రెండు వికెట్లతో మెరిశాడు. కపిల్‌దేవ్‌, రోజర్‌ బిన్నీలకు తలో వికెట్‌ తీసి భారత విజయంలో పాలు పంచుకున్నారు.  వెస్టిండీస్‌ ఆటగాళ్లలో వివియన్‌ రిచర్డ్స్‌ చేసిన 33 పరుగులే అత‍్యధిక స్కోరు. ఫైనల్లో కెప్టెన్  కపిల్ దేవ్ పట్టిన క్యాచ్ మ్యాచ్‌కే హైలెట్‌.  విండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ వివియన్‌ రిచర్డ్స్‌ ఇచ్చిన క్యాచ్‌ను కపిల్‌ దేవ్‌ వెనక్కి పరుగెడుతూ అందుకున్న తీరు అద్భుతం. ఈ క్యాచ్ తర్వాత విండీస్ బ్యాటింగ్ పేక మేడను తలపించింది. ఒత్తిడిలో ఆ జట్టు ఆటగాళ్లు వరుసగా వికెట్లను సమర్పించుకున్నారు.  చివర్లో మాల్కమ్ మార్షల్, జెఫ్ డుజోన్ పోరాడినా..అప్పటికే మ్యాచ్ విండీస్ చేజారింది. చివరకు  43 పరుగుల తేడాతో వెస్టిండిస్ ఓటమి పాలైంది. దీంతో హ్యాట్రిక్ వరల్డ్ కప్ సాధించాలన్న విండీస్‌ కల కళగానే మిగిలిపోగా...భారత్‌ తొలిసారి వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది.