డ్యూటీలో చేరినోళ్లు.. మళ్లీ సమ్మెలోకి

డ్యూటీలో చేరినోళ్లు.. మళ్లీ సమ్మెలోకి

 

  • డ్యూటీలో చేరినోళ్లు.. మళ్లీ సమ్మెలోకి
  • జేపీఎస్​లను చర్చలకు పిలిచి.. రద్దు చేసిన మంత్రి ఎర్రబెల్లి!
  • ఇండ్లకు వెళ్లి ఫ్యామిలీ మెంబర్లను వేధిస్తున్న ఆఫీసర్లు
  • రెగ్యులరైజ్ పై హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తం: సెక్రటరీలు

హైదరాబాద్, వెలుగు: ఒకటి రెండు రోజుల కింద డ్యూటీలో చేరిన కొద్దిమంది పంచాయతీ సెక్రటరీలు కూడా మళ్లీ సమ్మెలో జాయిన్ అవుతున్నారు. విధుల్లో చేరుతున్నట్లు తాము ఇచ్చిన లెటర్లు వెనక్కి ఇవ్వాలని అధికారులను కోరుతున్నారు. మంగళవారం 909 మంది సెక్రటరీలు డ్యూటీ లో జాయిన్ కాగా బుధవారం ఆ సంఖ్య 613కు తగ్గింది. తాము ఇచ్చిన లేఖ లను వెనక్కి తీసుకొని సమ్మె లో పాల్గొంటున్నామని ఎంపీడీవోలకు 300 మంది లేఖ రాశారు. డ్యూటీలో చేరికలపై పంచాయతీరాజ్ అధికారులు ఉన్నతాధికారులకు తప్పుడు లెక్కలిస్తున్నారని సెక్రటరీలు మండిపడుతున్నారు.

చర్చలకు పిలవలే..

సమ్మె విరమించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు కోరినా సెక్రటరీలు వెనక్కి తగ్గడం లేదు. బుధవారం మధ్యాహ్నం సెక్రటరీలకు నచ్చచెప్పేందుకు మంత్రి వారిని హైదరాబాద్ లో చర్చలకు ఆహ్వానించారు. దీంతో వివిధ జిల్లాల నుంచి సెక్రటరీ ఫెడరేషన్ నేతలు సుమారు 80 మంది హైదరాబాద్ వచ్చారు. అయితే చర్చలు రద్దు చేస్తున్నట్లు మంత్రి కార్యాలయం నుంచి తమకు సమాచారం వచ్చిందని సెక్రటరీలు చెబుతున్నారు. మరో వైపు మేం ఎవరినీ చర్చలకు పిలవలేదని అదంతా సొషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అని మంత్రి ఆఫీస్ అధికారులు చెబుతున్నారు. మరోవైపు డ్యూటీలో చేరేందుకు మంగళవారం సాయంత్రం డెడ్​లైన్ విధించిన రాష్ట్ర ప్రభుత్వం దానిని రాత్రి 10 వరకు పెంచారు. అయినా సెక్రటరీలు ముందుకు రాకపోవటంతో చర్యలపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది.  

అధికారుల వేధింపులు

సమ్మెలో ఉన్న సెక్రటరీలను డ్యూటీలో జాయిన్ అయ్యేలా చేసేందుకు జిల్లాల్లో ఎంపీవోలు, ఎంపీడీవోలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓ అధికారి.. మహిళా సెక్రటరీ సమ్మె శిబిరంలో ఉండగా ఆమె ఇంటికి వెళ్లి బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె భర్త ఫోన్ చేసి డ్యూటీలో చేరకపోతే డైవర్స్ ఇస్తా అన్నట్లు తెలుస్తున్నది. ఈ ఘటనపై సెక్రటరీలు ఫైర్ అవుతున్నారు. అధికారులు ఎంతకైనా దిగజారుతున్నారని మండిపడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎంపీవోలు, ఎంపీడీవోలకు ఉన్నతాధికారులు టార్గెట్ఇవ్వడంతో సెక్రటరీల ఇంటికెళ్లి వాళ్ల కుటుంబ సభ్యులను బెదిరించి డ్యూటీలో జాయిన్ కావాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

సమ్మె శాంతియుతంగా కొనసాగుతుంది

రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె శాంతియుతంగా కొనసాగుతుంది. చర్చలకు మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీలు పిలిచి, అనివార్య కారణాల వల్ల రద్దు చేశారు. దీంతో హైదరాబాద్ లో అందరం సమావేశమైనం. మాలో రెండు వర్గాలు లేవు. అందరం యూనిటీగా ఉన్నం. చర్చలకు మేం మొదటి నుంచి రెడీగా ఉన్నం. మా డిమాండ్ ఒకటే రెగ్యులర్ చేయాలని.. ఆ హామీ ఇస్తే వెంటనే డ్యూటీలో జాయిన్ అవుతం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేయటం లేదు.  - శ్రీకాంత్, స్టేట్ ప్రెసిడెంట్, తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ ఫెడరేషన్ (టీపీఎస్ఎఫ్)