కొనసాగుతున్న జేపీఎస్​ల ఆందోళన

కొనసాగుతున్న జేపీఎస్​ల ఆందోళన

నాగర్​ కర్నూల్, వెలుగు: రెగ్యులరైజ్​ చేయాలనే డిమాండ్​తో జేపీఎస్​లు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. ఎంపీడీవో ఆఫీసుల ఎదుట ఆందోళనలు చేపట్టి తమను రెగ్యులరైజ్​ చేయాలని నినాదాలతో హోరెత్తించారు. గురువారం పెంట్లవెల్లి ఎంపీడీవో ఆఫీస్​ ఎదుట జేపీఎస్​ నాలుగేళ్ల కూతురు ‘కేసీఆర్​ తాత నేను నాలుగు నెలల వయసు నుంచి మా అమ్మతో కలిసి డ్యూటీ చేసిన’ ప్లీజ్​ రెగ్యులరైజ్​ చేయవా అని ప్లకార్డుతో నిరసనలో పాల్గొంది. 

పెంట్లవెల్లిలో జేపీఎస్​లు మోకాళ్లపై కూర్చొని ధర్నా నిర్వహించారు. నాగర్​కర్నూర్​ ఎంపీడీవో ఆఫీస్​ ఎదుట చేపట్టిన ఆందోళనకు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు మద్దతు తెలిపారు. కడ్తల్  ఎంపీడీవో ఆఫీస్​ ఎదుట మహిళా జేపీఎస్​లు ముగ్గులు వేసి నిరసన తెలిపారు. వారికి కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి మద్దతు ప్రకటించారు.

నవాబుపేటలో జేపీఎస్​ల నిరసనకు ఉప సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్ష్యుడు రాములు నాయక్​ సంఘీభావం తెలిపారు. మద్దూరులో జడ్పీటీసీ రఘుపతి రెడ్డి మద్దతు ప్రకటించి, ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు.