- మీడియాతో చిట్‌చాట్‌లో జూపల్లి
హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాలపై చర్చ రాకుండా ఉండేందుకే స్పీకర్ మైకు ఇవ్వలేదనే సాకుతో బీఆర్‌ఎస్ సభ నుంచి వాకౌట్ చేసిందని మంత్రి జూపల్లి కృష్ణా రావు ఆరోపించారు. అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను పదేండ్ల పాటు బీఆర్ఎస్ దోచుకున్నప్పుడు కవిత రక్తం ఎందుకు మరగలేదో చెప్పాలని నిలదీశారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ చేశారు.
ప్రజాస్వామ్య దేశంలో ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో తప్పు ఎక్కడ జరిగిందో గుర్తించి, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కవిత గతంలో ఏదో ఉద్ధరించినట్లు, భవిష్యత్తులో మరేదో ఉద్ధరించనున్నట్లు ఊరూరా తిరుగుతోందని , అసలు ఆమెకు తెలంగాణపై ఉన్న చిత్తశుద్ధి ఏమిటని మంత్రి జూపల్లి ప్రశ్నించారు.
