అయిజ/అలంపూర్/ శాంతినగర్, వెలుగు : రబీ సీజన్ కు సరిపడా యూరియా అందుబాటులో ఉందని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గద్వాల జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ సక్రియా నాయక్ అన్నారు. శుక్రవారం అలంపూర్ నియోజకవర్గంలోని అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ మండలాల్లోని యూరియా పంపిణీ కేంద్రాలు, ఫర్టిలైజర్స్ దుకాణాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.
యూరియా ఇతర ఫర్టిలైజర్స్ నిల్వలకు సంబంధించిన రిజిస్టర్లు పరిశీలించి డీలర్లకు పలు సూచనలు చేశారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించవద్దని, యూరియాతో మరో ఎరువు కొనుగోలు చేయాలనే నిబంధనతో రైతులను ఇబ్బందికి గురి చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు యూరియా నిల్వలపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు.
