హత్యాయత్నం చేసినోళ్లను అరెస్ట్ చేయట్లే : చెట్టుపల్లి శివాజీ   

హత్యాయత్నం చేసినోళ్లను అరెస్ట్ చేయట్లే : చెట్టుపల్లి శివాజీ   
  • హత్యాయత్నం చేసినోళ్లను అరెస్ట్ చేయట్లే
  • మార్చి 28న చెట్టుపల్లి శివాజీపై మర్డర్ అటెంప్ట్ 
  • 19 రోజులు గడిచినా ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేయలే  
  • బీఆర్‌‌‌‌ఎస్‌‌ నేత కావడంతోనే పోలీసుల నిర్లక్ష్యం   
  • స్థానికంగా తిరుగుతున్నా పట్టించుకోవట్లే: చెట్టుపల్లి శివాజీ   

హైదరాబాద్‌‌, వెలుగు:   ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీపై జరిగిన హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు లింగంపల్లి కిషన్‌‌రావు ఇంకా పరారీలోనే ఉన్నాడు. కుషాయిగూడ పీఎస్ లిమిట్స్‌‌లో గత నెల 28న శివాజీపై హత్యాయత్నం జరిగింది. శివాజీ భార్య ఊర్మిళ ఫిర్యాదుతో కిషన్‌‌రావు ఆయన కొడుకులు నానాజీ, నేతాజీ, మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కిషన్‌‌రావును ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో నానాజీ, ఎన్‌‌.సతీశ్, బి.అవినాశ్​ను ఈ నెల5న అరెస్ట్‌‌ చేసి రిమాండ్‌‌కు తరలించారు. అయితే కిషన్‌‌‌‌రావు స్థానికంగా తిరుగుతున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. హత్యాయత్నం జరిగి19 రోజులు గడుస్తున్నా అరెస్ట్ చేయకపోవడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

బీఆర్ఎస్ నేతల ఒత్తిడితోనే.. 

కిషన్‌‌రావు బీఆర్‌‌‌‌ఎస్‌‌ పార్టీ నేత కావడం వల్లనే పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే అరెస్ట్ చేయడం లేదని చెప్తున్నారు. పోలీసులను అడిగితే పరారీలో ఉన్నాడని చెప్తున్నారని, స్థానికంగానే తిరుగుతున్నా అరెస్ట్ చేయట్లేదన్నారు. తమపై జరిగిన దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌‌లు, సాక్ష్యాలు పోలీసులకు అందించినప్పటికీ పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఉదయం11.30 గంటలకు అందరూ చూస్తుండగా కిషన్‌‌రావు చేయించిన దాడిలో తన రెండు చేతులు తీవ్రంగా దెబ్బతిన్నాయని బాధితుడు శివాజీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిషన్‌‌రావు, ఆయన కుటుంబసభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందన్నారు. ప్రధాన నిందితుడు కిషన్‌‌రావుతో పాటు ఇంకా పరారీలో ఉన్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్‌‌ చేశారు. లేకపోతే ఈ విషయంపై ఉన్నతాధికారులను 
ఆశ్రయిస్తామన్నారు.