సుప్రీంకోర్టు చీఫ్​ జస్టిస్​గా బీఆర్ గవాయ్ ప్రమాణస్వీకారం

సుప్రీంకోర్టు చీఫ్​ జస్టిస్​గా బీఆర్ గవాయ్ ప్రమాణస్వీకారం
  • ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
  • 52వ సీజేఐగా నియామకం
  • అభినందించిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 52వ చీఫ్ జస్టిస్​గా జస్టిస్‌‌ భూషణ్‌‌ రామకృష్ణ గవాయ్‌‌ (బీఆర్ గవాయ్) బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్​లోని గణతంత్ర మండప్​లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. జస్టిస్ బీఆర్ గవాయ్​తో ప్రమాణం చేయించారు. అనంతరం జస్టిస్ బీఆర్ గవాయ్ తన తల్లి కమల్ తాయి గవాయ్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. దేశంలోనే తొలి బౌద్ధ సీజేఐగా, జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత రెండో ఎస్సీ చీఫ్ జస్టిస్​గా బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు.

2025, నవంబర్ 23 వరకు ఆయన సుప్రీం కోర్టు సీజేఐగా కొనసాగుతారు. కాగా, జస్టిస్ బీఆర్ గవాయ్​కు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్​ఖడ్, హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్, న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, మాజీ రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్, లోక్‌‌సభ స్పీకర్ ఓం బిర్లా, మరికొంత మంది కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు, మాజీ సీజేఐలు, పలువురు న్యాయ నిపుణులు, ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. కాగా, 2019, మే 24 నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్ బీఆర్ గవాయ్.. అనేక రాజ్యాంగ ధర్మాసనాల్లో సభ్యుడిగా ఉన్నారు.

కుటుంబ నేపథ్యం

జస్టిస్ గవాయ్, 1960.. నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. తండ్రి పేరు రామకృష్ణ సూర్యభాన్ గవాయ్. ఆయన అంబేద్కర్‌‌తో కలిసి పనిచేశారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (గవాయి) స్థాపకుడు. బిహార్, సిక్కిం, కేరళ గవర్నర్‌‌గా పనిచేశారు. జస్టిస్ గవాయ్ తల్లి ఒక టీచర్. 

40 ఏండ్లుగా న్యాయవాద వృత్తిలో..

1985 మార్చి 16న 25 ఏండ్ల వయస్సులో బొంబాయి హైకోర్టులో జడ్జిగా న్యాయవాద వృత్తిలో అడుగుపెట్టారు. 2003లో బాంబే హైకోర్టులో అడిషనల్ జడ్జిగా నియమితులైన జస్టిస్‌‌ గవాయ్‌‌.. 2005లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొంది ఆ హైకోర్టు ప్రధాన ధర్మాసనం ఉన్న ముంబయితో పాటు, నాగ్‌‌పుర్, ఔరంగాబాద్, పనాజీ ధర్మాసనాల్లో సేవలందించారు. 2019లో సుప్రీంకోర్టు జడ్జిగా ఎంపికయ్యారు. గడిచిన ఆరేండ్లలో జస్టిస్‌‌ గవాయ్‌‌.. సుమారు 700 ధర్మాసనాల్లో భాగస్వామ్యం అయ్యారు.