ఓట్ల కోసం బీసీలకు అన్యాయం చేస్తరా? : రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌‌‌‌ కె. లక్ష్మణ్‌‌‌‌

ఓట్ల కోసం బీసీలకు అన్యాయం చేస్తరా? : రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌‌‌‌ కె. లక్ష్మణ్‌‌‌‌
  • రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్ కామెంట్ 

న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్‌‌‌‌తో పాటు ప్రతిపక్ష పార్టీలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఒక వర్గానికి కొమ్ముకాస్తూ, ఓబీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌‌‌‌ కె. లక్ష్మణ్‌‌‌‌ విమర్శించారు. ఈ మేరకు సోమవారం రాజ్యసభలో ఓబీసీ రిజర్వేషన్ల అంశంపై ఆయన మాట్లాడారు. రాజ్యసభలో లక్ష్మణ్ ప్రసంగాన్ని ప్రతిపక్ష ఎంపీలు అడ్డుకోవడమే కాకుండా, నిరసనగా వాకౌట్ చేశారు. అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. 

విపక్షాల తీరును ఎండగట్టారు. ఓబీసీల గొంతుకగా తాను మాట్లాడుతుంటే కాంగ్రెస్‌‌‌‌ సహా విపక్షాలన్నీ ఏకమై తన గొంతు నొక్కే ప్రయత్నం చేశాయని మండిపడ్డారు. తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ, బెంగాల్​ల్లో ముస్లిం మైనారిటీలను ఓబీసీ జాబితాలో చేర్చడం వల్ల అసలైన బీసీలకు నష్టం జరుగుతున్నదని ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌ ఎన్నికల్లో ఓబీసీలకు కేటాయించిన 50 సీట్లలో.. దాదాపు 30 మంది ముస్లిం అభ్యర్థులే గెలవడాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఇది బీసీల హక్కులను కాలరాయడమేనన్నారు. 

రిజర్వేషన్లు సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా ఉండాలి తప్ప, మతం ఆధారంగా కాదని స్పష్టం చేశారు. గతంలో వైఎస్సార్‌‌‌‌ ప్రభుత్వం తెచ్చిన 4% ముస్లిం రిజర్వేషన్లను హైకోర్టు అడ్డుకున్న విషయాన్ని గుర్తుచేశారు. జనగణనలో కుల గణన ద్వారానే ఓబీసీలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ లబ్ధి కోసం చేసే సర్వేలు కోర్టుల్లో నిలవవని, కేంద్ర హోంశాఖ చేపట్టే గణనే ప్రామాణికమని తేల్చి చెప్పారు. ‘కాంగ్రెస్ పార్టీకి హేట్ స్పీచ్‌‌‌‌పై అంత చిత్తశుద్ధి ఉంటే, హిందువులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఓవైసీపై ఎందుకు చర్యలు తీసుకోదు?’ అని లక్ష్మణ్ ప్రశ్నించారు.