భారత 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్.. ఆమోదం తెలిపిన రాష్ట్రపతి

భారత 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్.. ఆమోదం తెలిపిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన నియమాకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ప్రస్తుత సీజేఐ డీవై చంద్రచూడ్ స్థానంలో 2025, నవంబర్ 24న జస్టిస్ సూర్యకాంత్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. 2027, ఫిబ్రవరి 9 వరకు ఈ పదవిలో ఆయన కొనసాగుతారు. ఈ మేరకు గురువారం (అక్టోబర్ 30) కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని గెజిట్‎లో పేర్కొన్నారు.
  
ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. “భారత రాజ్యాంగం ఇచ్చిన విశిష్ట అధికారాలను ఉపయోగించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను 2025, నవంబర్ 24 నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించడానికి రాష్ట్రపతి సంతోషంగా ఉన్నారు” అని ఆయన పేర్కొన్నారు. నూతన సీజేఐగా నియామకమైన జస్టిస్ సూర్యకాంత్ కు అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. 

జస్టిస్ సూర్య కాంత్ నేపథ్యం:

జస్టిస్ సూర్య కాంత్ 1962,  ఫిబ్రవరి 10న హర్యానాలోని హిసార్‌లో జన్మించారు. 1984లో రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం నుంచి ఆయన న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆ తర్వాత హిసార్ జిల్లా కోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు.1985లో పంజాబ్, హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2000, జూలై 7న ఆయన హర్యానా అడ్వకేట్ జనరల్‎గా నియమితులయ్యారు. 

►ALSO READ | CBSE బోర్డు ఎగ్జామ్స్ 2026: 10, 12 క్లాసుల ఫైనల్ డేట్ షీట్ రిలీజ్..

2004లో జస్టిస్ సూర్యకాంత్ పంజాబ్, హర్యానా హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2019,  మేలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమోట్ అయ్యారు. సీనియారిటీ ఆధారంగా సుప్రీంకోర్టు సీజేఐగా నియమితులయ్యారు. 2025, నవంబర్ 24న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ సూర్యకాంత్.. 2027, ఫిబ్రవరి 9 న పదవీ విరమణ చేయనున్నారు.