ప్రతి ప్రాజెక్టులోనూ కేసీఆర్ సర్కారు దోపిడీ: జస్టిస్ చంద్రకుమార్

ప్రతి ప్రాజెక్టులోనూ  కేసీఆర్  సర్కారు దోపిడీ: జస్టిస్ చంద్రకుమార్
  • కమీషన్లు లేకనే ఎస్ఎల్ బీసీ పూర్తి చేస్తలేరు: జస్టిస్‌‌  చంద్రకుమార్‌‌‌‌    ఉమ్మడి ఏపీ ప్రభుత్వం
  • 52 శాతం కడితే..  కేసీఆర్‌‌ ‌‌ ప్రభుత్వం 25 శాతం కూడా కట్టలే: ఆకునూరి మురళి
  • బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆవేదన
  • దోచుకోవడానికే కాళేశ్వరం ప్రాజెక్టు: చెరుకు సుధాకర్

హైదరాబాద్‌‌, వెలుగు: ఎస్‌‌ఎల్‌‌బీసీ (శ్రీశైలం లెఫ్ట్  బ్యాంక్  కెనాల్) ప్రాజెక్టు పూర్తిచేస్తే  ఫ్లోరైడ్‌‌  సమస్యను నిర్మూలించవచ్చని, కానీ కమీషన్లు లేకపోవడంతో ఆ ప్రాజెక్టును  కేసీఆర్‌‌ ప్రభుత్వం ‌‌పూర్తిచేయడం లేదని జస్టిస్‌‌ చంద్రకుమార్‌‌‌‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ప్రాజెక్టులోనూ దోపిడీ చేస్తున్నదని ఆయన విమర్శించారు. ‘ఎస్‌‌ఎల్‌‌బీసీ  సొరంగ గ్రావిటీ కాలువతో  నల్గొండకు జరిగిన అన్యాయం ఏమిటి?  దశ, దిశ లేని డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు’ అన్న అంశాల మీద ప్రొఫెసర్  వినాయక్‌‌ రెడ్డి  అధ్యక్షతన మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌‌క్లబ్‌‌లో తెలంగాణ సకల జనుల వేదిక,- తెలంగాణ జల సాధన సమితి  ఆధ్వర్యంలో రౌండ్‌‌ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ  సమావేశంలో జస్టిస్‌‌  చంద్రకుమార్, మాజీ ఐఏఎస్  ఆకునూరి మురళి, కాంగ్రెస్  నేత చెరుకు సుధాకర్‌‌‌‌, రిటైర్డ్‌‌  ఇంజినీర్లు, విశ్లేషకులు తదితరులు పాల్గొన్నారు. జస్టిస్‌‌  చంద్రకుమార్‌‌ ‌‌మాట్లాడుతూ ఉద్యమంలో ఫ్లోరైడ్‌‌  గురించి, నల్గొండ నీటి బాధల గురించి మాట్లాడిన కేసీఆర్‌‌..  ‌‌ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు. 

రూ.2000 కోట్లతో ఎస్‌‌ఎల్‌‌బీసీ ప్రాజెక్టు పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని, రూ.3000 కోట్లు ఒక్క కరెంట్‌‌ బిల్లులకే ఖర్చుపెట్టే  దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రజల పక్షాన పోరాడే వారందరూ ఒకేతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆకునూరి మురళి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలోనే ఎస్‌‌ఎల్‌‌బీసీ ప్రాజెక్టును 52 శాతం పూర్తిచేస్తే, తొమ్మిదేండ్లలో కేసీఆర్‌‌  ‌‌ప్రభుత్వం 25 శాతం కూడా కట్టలేదని మండిపడ్డారు. కమీషన్లు కురిపించే ప్రాజెక్టు మాత్రమే కడుతున్నారని విమర్శించారు. బంగారు తెలంగాణ అని చెప్పి రాష్ట్రాన్ని సీఎం ‌‌నాశనం చేశారని దుయ్యబట్టారు. కేసీఆర్‌‌  ‌‌జోక్యం వల్లే ప్రాజెక్టుల నిర్మాణం ముందుకు పోవడం లేదన్నారు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, విద్య, వైద్య వ్యవస్థలు కుప్పకూలాయని ఆకునూరి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో సీఎం కేసీఆర్  ఇష్టానుసారం దోచుకుంటున్నారని కాంగ్రెస్  నేత చెరుకు సుధాకర్  అన్నారు. తుమ్మిడిహెట్టిని నిర్మించకుండా దోచుకొవడానికే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని ఆయన ఫైరయ్యారు. డిండి ప్రాజెక్ట్​కు నీటి వనరులు నిర్ణయించకపోవడంతో నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతున్నాయని రిటైర్డ్‌‌  ఇంజినీర్‌‌  ‌‌విఠల్‌‌ రావు అన్నారు. ఎస్ఎల్‌‌బీసీ కన్నా ఆలస్యంగా చేపట్టిన శ్రీశైలం వెలుగోడు సొరంగాన్ని జగన్  ప్రభుత్వం పూర్తి చేసిందని సీపీఎంఎల్  న్యూడెమోక్రసీ నాయకుడు కోటేశ్వరరావు అన్నారు.