ఢిల్లీ తెలంగాణ భవన్‌ లో ఘనంగా పూలే జయంతి

ఢిల్లీ తెలంగాణ భవన్‌  లో ఘనంగా పూలే జయంతి

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. రెసిడెంట్ కమిషనర్ డా. శశాంక్ గోయెల్.. మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రముఖ సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. 

దళితుల అభ్యున్నతి, అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనకు జ్యోతిరావు పూలే జీవితాంతం కృషి చేశారని స్మరించుకున్నారు. విద్య ప్రాముఖ్యతను సమాజానికి తెలియజేసి.. సామాజిక సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, ప్రాయోజిత పథకాల సమన్వయ కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్, తెలంగాణ భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.