
ఈ మధ్య కాలంలో కే పాప్ సింగర్ల ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. ఒత్తిడిని తట్టుకోలేక చిన్న వయసులోనే బలవన్మరణానికి పాల్పడుతున్నారు. గత నెల 19న ఆస్ట్రో బ్యాండ్ కు చెందిన ప్రముఖ కే పాప్ స్టార్ మూన్‌బిన్ చనిపోవడం ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేయగా... ఇప్పుడు ప్రముఖ కొరియన్ పాప్ (కే-పాప్) సింగర్ హేసూ (29) సోమవారం ( మే 15)కన్నుమూశారు.
హోటల్ గదిలో విగత జీవిగా
తన పాటలతో సంగీత ప్రియులను, శ్రోతలను అలరించిన ప్రముఖ కొరియన్ పాప్ (కే-పాప్) సింగర్ హేసూ దక్షిణ కొరియా జియోల్లబుక్-డో ప్రావిన్స్‌లోని వాంజుగన్ కౌంటీలోని తన హోటల్ గదిలో విగత జీవిగా కనిపించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. ఆమె మృతదేహం వద్ద ఓ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మే 20 షెడ్యూల్ అయిన ఓ ఈవెంట్ కోసం వాంజుగన్ చేరుకున్నారు హైసూ. ఈ క్రమంలోనే అక్కడి హోటల్ గదిలో బస చేసిన ఆమె.. విగత జీవిగా కనిపించారు. ఈ విషయాన్ని గుర్తించిన అక్కడి సిబ్బంది, ఈవెంట్ నిర్వాహకులు.. పోలీసులకు సమాచారమిచ్చారు.
కాగా, 1993లో జన్మించిన హేసూ.. ‘మై లైఫ్, మీ’ అనే ఆల్బమ్‌తో 2019లో కే పాప్లోకి అరంగేట్రం చేశారు. ఆ తర్వాత గాయో స్టేజ్, హ్యంగౌట్ విత్ యూ, ది ట్రోట్ షో లాంటి కార్యక్రమాల్లో పాడి ఫుల్ క్రేజ్ దక్కించుకున్నారు. అలా తన అద్భుతమైన పాటలతో, గాత్రంతో అభిమానులను సంపాదించుకున్నారు. హేసూ తన మరణానికి ముందు రోజు వరకు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేది. రోజూ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో కమ్యూనికేట్ చేసింది.యువ కె-పాప్ స్టార్ మరణానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు సంతాపం తెలిపారు . ఇంత చిన్న వయసులోనే ఎంతో భవిష్యత్తు ఉన్న సింగర్ చనిపోవడంతో ఆయన అభిమానులు అంతా శోకసంద్రంలో మునిగిపోయారు.