ఆర్మీ అభ్యర్థులపై దాడులను ఖండించిన కేఏ పాల్

ఆర్మీ అభ్యర్థులపై దాడులను ఖండించిన కేఏ పాల్
  • పబ్లిక్ ఆస్తులను ధ్వంసం చేయొద్దు
  • శ్రీలంక, సూడాన్లా భారత్ ఆర్ధిక వ్యవస్థ
  • ప్రజా శాంతిలో చేరండి... దేశాన్ని రక్షించండి
  • ప్రజా శాంతి పార్టీ ప్రెసిడెంట్ కేఏ పాల్

న్యూఢిల్లీ: అగ్నిపథ్ స్కీంపై నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగిన నిరుద్యోగులపై కాల్పుల జరపడం దారుణమని ప్రజా శాంతి పార్టీ ప్రెసిడెంట్ కేఏ పాల్ మండిపడ్డారు. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన నిరుద్యోగికి నివాళి అర్పించారు. ఆర్మీ అభ్యర్థులపై పోలీసుల దాడిని ఖండించారు. అగ్నిపథ్ స్కీం, దేశ ఆర్ధిక వ్యవస్థపై తదితర అంశాలపై కేఏ పాల్ ఢిల్లీలో మాట్లాడుతూ... సికింద్రాబాద్ లో ప్రజా స్వామ్య యుతంగా ఆందోళన చేస్తున్న యువకులపై కాల్పులు జరపడం దారుణమన్నారు. ఇంత జరుగుతోన్న చర్యలు తీసుకోకుండా కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. పబ్లిక్ ఆస్తులను ధ్వంసం చేయొద్దని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. 

నిరుద్యోగానికి ఆర్ధిక పతనమే కారణమని, దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో గత ప్రభుత్వాలు, ప్రస్తుత మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ఒకప్పుడు చైనాతో సమానంగా ఉన్న భారత్ ఎకానమీ... కొన్ని దశాబ్దాలుగా పడిపోతూ వస్తోందన్నారు. దేశ ఆర్ధిక పరిస్థితి శ్రీలంక, సూడాన్లా తయారైందన్నారు. ఈ నేపథ్యంలో దేశాన్ని ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ప్రజా శాంతి పార్టీ ఆధ్వర్యంలో ఏడు సూత్రాల ప్రణాళికా రూపొందించామన్నారు. ఇవాళ ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారులు ప్రజా శాంతిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, యువత పెద్ద ఎత్తున ప్రజా శాంతి పార్టీలో చేరాలని కోరారు.