V6 News

శిరీష కుటుంబానికి న్యాయం చేయాలి

శిరీష కుటుంబానికి న్యాయం చేయాలి
  •     పరిగి డీఎస్పీని కోరిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్
  •     కాళ్లాపూర్​లోని శిరీష కుటుంబానికి పరామర్శ 

పరిగి, వెలుగు: తెలంగాణ హత్యల రాష్ట్రంగా మారిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి పరిధిలోని కాళ్లాపూర్​లో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువతి శిరీష కుటుంబాన్ని మంగళవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో చట్టాలు సరిగ్గా లేవని, ఉన్నవాటిని అమలు చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. దొంగల ప్రేమలో పడి అమ్మాయిలు మోసపోవద్దని సూచించారు. శిరీష మృతి తెలిసి మనోవేదనకు గురయ్యానని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రోడ్ల మీద నరహంతకులు తిరుగుతున్నారని, ఘటన జరిగిన 15 రోజుల్లో ఎఫ్ఐఆర్, నెలలోపు చార్జిషీట్ నమోదు చేసేలా, ఆరు నెలలు లేదా సంవత్సరంలోపు శిక్షపడేలా చట్టాలు తీసుకురావాలన్నారు. తనను సీఎం లేదా ఎంపీగా ఎన్నుకుంటే కఠినమైన చట్టాలు తీసుకొచ్చేలా బిల్లు పాస్ చేయిస్తానన్నారు. పొంగులేటి ఏ పార్టీలో చేరుతారన్న అంశంపై డిబేట్లు పెడుతున్న మీడియా.. ప్రజా సమస్యల మీద పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే శిరీష డెడ్​బాడీ దొరికిన ప్రదేశాన్ని కేఏ పాల్ పరిశీలించారు. అక్కడి నుంచి పరిగి డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి, డీఎస్పీ కరుణసాగర్ రెడ్డితో మాట్లాడారు. యువతి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మంగళవారం మధ్యాహ్నం శిరీష డెడ్​బాడీ దొరికిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కాళ్లాపూర్​లోని శిరీష కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. శిరీష గతంలో ఒకసారి ఆత్మహత్యా యత్నం చేసిందని కుటుంబ సభ్యులు చెప్పినట్లు ఎస్పీ తెలిపారు. మృతురాలి ఫోన్ ఓపెన్ కాలేదని, సైబర్ సిబ్బంది ద్వారా డేటాను సేకరించి విచారణ చేస్తామన్నారు. వైద్య నిపుణులతో కోఆర్డినేషన్ చేసుకుంటున్నామని, రిపోర్టు రాగానే మృతికి గల కారణాలను వివరిస్తామన్నారు.