కడెం ప్రాజెక్ట్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. సామర్థ్యానికి మించి కడెం ప్రాజెక్ట్ కు వరద వస్తోంది. ఇప్పటికే ప్రాజెక్ట్ అన్ని గేట్లు ఎత్తి 3లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. కానీ.. పై నుంచి 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరదనీరు వస్తోంది. ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. కడెం ప్రాజెక్టు వద్దకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రమాదకర స్థితిలో వరద నీరు చేరుకొంటోందన్నారు. కడెం పరిసర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఎగువ ప్రాంతంలో ఇటు ఎస్సారెస్పీ నుంచి అటు బోధ్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వరద నీరు ప్రాజెక్టులోకి చేరుకోవడంతో ఈ పరిస్థితి నెలకొందన్నారు. ప్రాజెక్టు వద్ద ఉన్న పరిస్థితులను సీఎం కేసీఆర్ కు ఎప్పటికప్పుడు నివేదిస్తున్నట్లు పేర్కొన్నారు. వర్షాలు తగ్గితేనే వరద నీటి ప్రవాహం తగ్గే అవకాశాలున్నాయని చెప్పారు.
12గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కడెం ప్రాజెక్ట్ ఎడమకాలువ మైసమ్మ గుడి దగ్గర గండిపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాండవాపూర్ చెక్ పోస్ట్ దగ్గర ప్రధాన రహదారి పైనుంచి కడెం ప్రాజెక్ట్ వరద ప్రవహిస్తోంది. భారీగా వరద వస్తుండటంతో.. కడెం ప్రాజెక్ట్ చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. NDRF బృందాల సహాయం కోరారు అధికారులు. కడెం పూర్తిస్థాయి నీటిమట్టం.. 700 అడుగులు కాగా.. 700 అడుగులు నిండిపోయింది. కడెం కెపాసిటీ.. 7.6టీఎంసీలు కాగా.. 7.6టీఎంసీలు నిండిపోయింది. అయినా అతిభారీగా వరద వస్తోంది. ప్రాజెక్ట్ కు 18గేట్లు ఉండగా.. ఒక గేట్ పైకి లేవకపోవడంతో 17గేట్లను మొత్తం పైకి ఎత్తారు. ఇన్ ఫ్లో భారీగా ఉండటం.. ఔట్ ఫ్లో తక్కువగా ఉండటం వల్ల.. రెడ్ అలర్ట్ ప్రకటించి రాత్రి నుంచే గ్రామాలను ఖాళీ చేయించారు అధికారులు. వరద నీరు ఇప్పటికే ప్రాజెక్ట్ నిండి గ్రామాల్లోకి చేరుతుంది. ప్రాజెక్ట్ వల్ల.. కడెం, కన్నాపూర్, దేవునిగూడెం, రాంపూర్, మున్యాల్, గొడిసిర్యాల, పాండవాపూర్, అంబారీపేట్, కొందుకూరు, బూత్కూర్, దేవునిగూడెం గ్రామాలకు భారీగా ఎఫెక్ట్ ఉండనుంది.
