- కెపాసిటీకి మించి చేరిన వరద.. గంట గంటకూ టెన్షన్
- ఎగువ నుంచి 5 లక్షల
- క్యూసెక్కుల వరద ప్రవాహం
- 17 గేట్లెత్తి కిందికి 3 లక్షల
- క్యూసెక్కుల నీళ్లు విడుదల
- మొరాయించిన మరో గేటు
- ఎడమ కాలువ వైపు మైసమ్మ గుడి వద్ద భారీ గండి
- లోతట్టు ప్రాంత ప్రజల తరలింపు
నిర్మల్ / కడెం : నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు చుట్టూ ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి ఎగువ నుంచి ఐదు లక్షల క్యూసెక్కులకుపైగా వరద నీరు తరలివస్తుండడంతో భయాందోళనలు నెలకొన్నాయి. ఎగువ ప్రవాహాన్ని అంచనా కట్టడం ప్రస్తుతం సాధ్యం కావడం లేదు. అయితే ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం 18 గేట్లకుగాను 17 గేట్లను పూర్తిగా పైకెత్తి మూడు లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. మరో గేటు మొరాయించింది. కిందికి వదులుతున్న నీటి కన్నా రెండింతలు రిజర్వాయర్‌లోకి వరద ప్రవాహం కొనసాగుతున్నందున అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ఓ దశలో తాము చేసేదేమీ లేదంటూ చేతులెత్తేసినంత పని చేశారు. వరద నీటిలో ప్రాజెక్టు కొట్టుకుపోయే ప్రమాదం కూడా పొంచి ఉందన్న ప్రచారం జరగడంతో హైటెన్షన్ నెలకొంది.
మధ్యాహ్నం తగ్గి.. మళ్లీ పెరిగింది..!
బుధవారం ఉదయం ప్రాజెక్టు చివరి భాగంలోని ఎడమ కాలువ వైపు మైసమ్మ గుడి వద్ద భారీ గండి పడింది. ఈ గండి కారణంగా రిజర్వాయర్ లోని లక్ష క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్లిపోయింది. దీంతో రిజర్వాయర్ నీటి ఉధృతి కొంతమేరకు తగ్గింది. అయితే.. ఆ తర్వాత మళ్లీ కాసేపు వరద జోరందుకొని.. మధ్యాహ్నం నుంచి తగ్గుముఖం పట్టింది. మధ్యాహ్నం పూట ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 2 లక్షల 98 వేల 947 క్యూసెక్కులుగా కొనసాగగా , 2 లక్షల 99 వేల 47 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. ఔట్ ఫ్లో ,ఇన్ ఫ్లో సమానంగా కొనసాగడంతో అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించారు. కాగా మళ్లీ సాయంత్రం నుంచి ఇన్ ఫ్లో భారీగా పెరగడం మొదలైంది. దాదాపు 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తున్నదని అధికారులు అంచనా వేస్తున్నారు.
మధ్యాహ్నం వరకు ఉధృతిని తగ్గించిన గండి
కడెం రిజర్వాయర్ లోకి ఎగువ నుంచి లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో ఆ నీటిని పూర్తిస్థాయిలో దిగువకు వదలడం కష్టతరమైంది. 17 గేట్లు ఎత్తి దాదాపు మూడు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినప్పటికీ రిజర్వాయర్ నీరు ప్రాజెక్టు పైనుంచి ప్రవహించే పరిస్థితికి చేరుకుంది. ఏ క్షణమైనా ప్రమాదం జరగవచ్చని అందరూ ఆందోళన చెందుతున్న సమయంలో ప్రాజెక్టు చివరన గల మైసమ్మ గుడి వద్ద భారీ గండి పడింది. ఈ గండి ద్వారా దాదాపు లక్ష క్యూసెక్కులకు పైగా నీరు రిజర్వాయర్ నుంచి బయటకు వెళ్లి గోదావరి నదిలో కలిసింది. ఈ కారణంగా రిజర్వాయర్ ఉధృతి కొంతమేర తగ్గడంతో మధ్యాహ్నం వరకు ఇన్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కుల నుంచి రెండు లక్షల 98 వేల క్యూసెక్కులకు తగ్గింది .అయితే.. మళ్లీ మధ్యాహ్నం తర్వాత నుంచి వరద పెరిగింది. పాండవాపూర్ బ్రిడ్జి పూర్తిగా నీట మునిగిపోవడం, రోడ్డు తెగిపోవడంతో నిర్మల్– మంచిర్యాల మధ్య పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి.
పరిస్థితిని సమీక్షించిన మంత్రి ఇంద్రకణ్‌రెడ్డి
కడెం ప్రాజెక్టు పరిస్థితిని తెలుసుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఆర్మూర్ మీదుగా బాదనకుర్తి రోడ్డు గుండా కడెం వద్దకు చేరుకున్నారు. కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీతో కలిసి మంత్రి, ఎమ్మెల్యే ప్రాజెక్ట్ వద్ద నుంచి అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షించారు. మంత్రి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రాజెక్టు వద్దనే ఉండి పరిస్థితులను సమీక్షించారు. సీఎం కేసీఆర్ కూడా మంత్రికి ఫోన్ చేసి పరిస్థితులపై ఆరా తీశారు.
లోతట్టు ప్రాంతాల జనం తరలింపు..
కడెం ప్రాజెక్టు వరదతో ముంపుకు గురయ్యే అవకాశం ఉన్న 13 గ్రామాల్లోని లోతటు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. కడెం మండలంలోని కడెం, కన్నాపూర్, అంబర్పేట్, పాండవాపూర్, కొండుకూర్ గ్రామాలతోపాటు దస్తురాబాద్ మండలంలోని గొడిసిరియాల, గోండ్ గూడ, మున్యాల్, మున్యాల గూడా, దేవుని గూడెం, రాంపూర్, బూత్కూర్, నవాబ్‌పేట్ గ్రామాల నుంచి దాదాపు 3వేల మందిని షెల్టర్ జోన్ కు షిఫ్ట్ చేశారు. కడెం, పెంబి, దస్తూరాబాద్, ఖానాపూర్ మండలాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది.
