
- సౌతాఫ్రికా పేసర్‌పై తాత్కాలిక సస్పెన్షన్
- అందుకే ఐపీఎల్‌కు దూరమైనట్టు జీటీ క్రికెటర్ వెల్లడి
- రిక్రియేషనల్ డ్రగ్ తీసుకున్నట్టు తెలిపిన కగిసో
- డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కూడా దూరమయ్యే చాన్స్
జోహన్నెస్‌బర్గ్: సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ సంచలన విషయం బయటపెట్టాడు. నిషేధిత రిక్రియేషనల్ డ్రగ్ వాడిన కారణంగా తాను తాత్కాలిక సస్పెన్షన్‌లో ఉన్నానని చెప్పాడు. ఈ కారణంగానే ఐపీఎల్ నుంచి తప్పుకున్నానని శనివారం ప్రకటించాడు. రూ. 10.75 కోట్లతో ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టులోకి వచ్చిన రబాడ కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడి వ్యక్తిగత కారణాలతో లీగ్ నుంచి తప్పుకున్నాడు. 30 ఏండ్ల రబాడ సౌతాఫ్రికన్ క్రికెటర్స్ అసోసియేషన్ (ఎస్‌ఏసీఏ) ద్వారా తన సస్పెన్షన్‌కు సంబంధించి ప్రకటన విడుదల చేశాడు.
నేను ఐపీఎల్ నుంచి వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి తిరిగి వచ్చినట్టు చెప్పాను. కానీ, రిక్రియేషనల్ డ్రగ్ వాడినట్లు డోప్ టెస్ట్‌లో తేలడమే అసలు కారణం. ప్రస్తుతం నేను తాత్కాలిక సస్పెన్షన్‌లో ఉన్నాను. అయితే నాకెంతో ఇష్టమైన ఆటలోకి తిరిగి రావాలని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్న రబాడ చేసిన తప్పుకు క్షమాపణ కోరాడు. జనవరి–-ఫిబ్రవరిలో ఎస్‌ఏ20 లీగ్‌లో ఆడుతున్నప్పుడు రబాడ నుంచి సేకరించిన శాంపిల్ డ్రగ్ టెస్టులో పాజిటివ్ రిజల్ట్ వచ్చినట్టు సౌతాఫ్రికా క్రికెట్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
దాంతో జూన్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో రబాడ ఆడటం ప్రశ్నార్థకంగా మారింది. వరల్డ్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (వాడా) రూల్స్ ప్రకారం రిక్రియేషనల్ డ్రగ్ వాడినందుకు మూడు నెలల నుంచి నాలుగు సంవత్సరాల వరకు శిక్ష విధిస్తారు. ఈ డ్రగ్‌ను పోటీకి దూరంగా ఉన్న సమయంలో, పర్ఫార్మెన్స్ మెరుగుదల కోసం కాకుండా వినోదం కోసం వాడినట్టు నిరూపిస్తే శిక్షను మూడు నెలలకు తగ్గించవచ్చు. అలాగే, సౌతాఫ్రికా యాంటీ -డోపింగ్ బాడీ ఆమోదించిన ట్రీట్‌మెంట్ ప్రోగ్రామ్‌లో పాల్గొంటే కూడా శిక్షను రెండు నెలలకు తగ్గించే అవకాశం ఉంది. ఒకవేళ పోటీల సమయంలో ఈ డ్రగ్‌ను వాడినా అది పెర్ఫార్మెన్స్ కు సంబంధం లేనిదనినిరూపిస్తే రెండు సంవత్సరాల నిషేధం పడే చాన్సుంది.